Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు వ్యవసాయ పొలాలన్నీ స్థలాలుగా మారిపోయేవి. భారీ స్థాయిలో వెంచర్లు వెలిసేవి. వ్యవసాయానికి పాలకుల నుంచి సహకారం లేకపోవడం, నష్టాలు చవిచూడడంతో కష్టపడి పండించి ఇబ్బందుల పాలయ్యే బదులు మంచి ధర వస్తే అమ్మేయడమే మంచిదనే నిర్ణయానికి రైతులు వచ్చేవారు. కానీ ఏపీలో కొద్ది కాలంగా పరిస్థితి మారింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి పండగలా మారుతోంది. రియల్టర్లకు వ్యవసాయ పొలాల విక్రయం తగ్గుముఖం పట్టింది. రైతులకు ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సర్కారు, ప్రవేశపెట్టిన కొత్త పథకాలతో వ్యవసాయంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నష్టాలు లేకుండా లాభదాయకమైన పద్ధతుల్లో వ్యవసాయం కొనసాగేలా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఉపయోగపడే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులతో కలిసి సలహామండళ్లు ఏర్పాటు చేశారు. ఆయా మండళ్ల నుంచి రైతులు వ్యక్తం చేసే అభిప్రాయాలు, సమస్యలపై నేరుగా కలెక్టర్లు స్పందించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులు చెప్తున్న సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలని, దానిపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలతో చాలా సమస్యలు పరిష్కారం పొందుతున్నాయి. సుమారు లక్ష మందికిపైగా రైతులు ఈ వ్యవసాయ సలహామండళ్లలో ఉన్నారు. వీటి ద్వారా ఒకరికిమరొకరు సలహాలు, సూచనలు చేసుకుంటూ వ్యవసాయాన్ని స్వయంగా అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతోంది.
అలాగే, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు భరోసాకేంద్రాల పనితీరు, సామర్థ్యం మెరుగుపడేలా ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది. నాణ్యత ఉన్నవాటిని రైతులకు అందించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించేలా చేశారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా కూడా రైతుల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థను కూడా సిద్ధం చేస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) దానికి వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. నేచురల్ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నేచురల్ ఫార్మింగ్ కు కావాల్సిన సామగ్రిని రైతుల కోసం అందుబాటులోకి తెచ్చింది.
ఆర్బీకే కేంద్రాలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూ చిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. భవనాలను విస్తరించి నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అప్పటి వరకూ అద్దె ప్రాతిపదికన కొన్ని భవనాలు తీసుకోవాలని అధికారులు సూచించింది. ఆర్బీకేల పనితీరుమీద కూడా సర్టిఫికెషన్ ఉండాలన్నారు. ఆర్బీకేల పనితీరుపె నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉండేలా సీఎం జగన్ తగిన ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఆర్బీకేల పనితీరును మెరుగుకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు
వైఎస్సార్ పొలంబడి ద్వారా ఏ పంటలు ఎప్పుడు వేస్తే మంచిదో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆర్గానిక్ పంటలను పెంచడం, అందుకోసం రైతులకు శిక్షణ ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించేలా రూపొందించిన వీడియోలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. చిరుధాన్యాల సాగును కూడా ప్రోత్సహిస్తోంది. బోర్ల కింద, వర్షాధార భూములలో చిరు ధాన్యాలు సాగుచేసేలా చూస్తోంది. వరికి బదులు చిరుధాన్యాలు సాగు చేసినా ఆదాయాలు బాగా వస్తాయన్న అంశంపై రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. చిరుధాన్యాల సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించే బాధ్యత అధికారులకు అప్పగించింది. దాని వల్ల రైతులు మరింత ముందుకు వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
వ్యవసాయానికి కావాల్సింది ప్రధానంగా విద్యుత్. దీంతో ఎక్కడా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినా వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తోంది. అంతటితో ఆగకుండా ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన చోట లోడ్, ఇతరత్రా పరిస్థితులను సమీక్షించి పునరావృతం కాకుండా పటిష్టమైన ప్రణాళికలు రచిస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడానికి కారణాలపైన కూడా అధ్యయనం చేస్తోంది. మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు కాలుతుంది, ఎంత లోడ్ పడుతుందనే విషయం తెలుసుకుంటోంది. వ్యవసాయం కోసం ఎంత విద్యుత్ వాడినా ఆ భారం రైతులపై పడకుండా సంబంధిత బిల్లులను ప్రభుత్వమే నేరుగా పంపిణీ సంస్థలకు చెల్లిస్తోంది.
ఇలా వ్యవసాయ రంగంపై జగన్ సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. కేవలం నగదు బదిలీకే పరిమితం కాకుండా, వ్యవసాయం అభివృద్ధికి పక్కా ముందుకెళ్లడం ద్వారా రైతుల్లో భరోసా నింపుతోంది.