ప్రభుత్వ పాఠశాలలు అంటే.. విరిగిపోయిన బెంచీలు, డోరు లేని మూత్రశాలలు, పెయింట్‌లేని నల బోర్డులు, సిమెంట్ తాగునీటి ట్యాంకులు, ఫ్యాన్లు లేని క్లాస్ రూములు.. ఇది ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించిన దృష్యాలు. ఈ దృష్యాలు మళ్లీ చూడాలంటే.. ఒకసారి త్వరగా వెళ్లి చూసి రండి. ఎందుకంటే మరో నెల రోజులు ఆగితే మీరు చూడాలన్నా ఇవి కనిపించవు. ఇది మనం చదువుకున్న బడేనా..? లేక కార్పొరేట్ సంస్థ ఏదైనా ఇక్కడ పాఠశాల పెట్టిందా..? అనే అనుమానం మీకు కలిగినా ఆశ్చర్యం లేదు.
ఒకప్పుడు ప్రాథమిక అవసరాలంటే కూడు, గుడ్డ, నీడ.. కానీ నేడు ప్రాథమిక అవసరాలంటే నాణ్యమైన విద్య, వైద్యం. ఈ రెండింటికి కోసం పేద, మధ్య తరగతి ప్రజలు తమ రెక్కల కష్టాన్ని ధారపోస్తున్నారు. నాణ్యమైన విద్య అందక తరాలు మారినా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్ పథకంలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని యువతీయువకులు ఉన్నత చదువులు చదువుకోగలిగారు. ఆయన వేసిన బాటలోనే నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారు. తన తండ్రి పేద వాడి కోసం ఒకడు వేస్తే.. తాను నాలుగు అడుగులు వేస్తానని చెప్పే వైఎస్ జగన్.. ఆ మాటలను ఆచరణలో చేసి చూపిస్తున్నారు.
ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్‌కు పునాది. పునాది ఎంత గట్టిగా ఉంటే.. ఆ పై బహుల అంతస్తుల భవనం నిర్మించుకోవచ్చనే రీతిగా నాణ్యమైన ప్రాథమిక విద్య అందిస్తే.. ఆ పిల్లలు భవిష్యత్‌లో ఉపాధి పొందగలిగే ఉన్నత చదువులు అభ్యసిస్తారు. ఫలితంగా ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. అందుకే సీఎం జగన్ ప్రాథమిక విద్య నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకూ ఉచిత విద్యను అందించేందుకు వినూత్న పథకాలు ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా, వసతి దీవెన పథకాలతో విద్యను పేద, మధ్యతరగతికి అందించారు. విద్యార్థులు పాఠశాలలకు ఇష్టంగా వచ్చేలా అక్కడ మౌలిక సదుపాయల కల్పన కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. జగనన్న గోరుముద్దల పథకంతో ప్రతి రోజు విభిన్నమైన మెనూతో భోజనం పెడుతున్నారు.
ఆగస్టు 3వ తేదీన ప్రారంభమయ్యే పాఠశాలలు.. పిల్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ప్రైవేటు కాదు.. తాము నగరాల్లో ఉండే కార్పొరేట్ స్కూళ్లలో ఉన్నామనే భావన ప్రస్తుతం చేస్తున్న నాడు నేడు పనులతో కలుగుతుందనడంలో సందేహం లేదు. గ్రీన్ బోర్డు, ఆర్.వో ప్లాంట్‌తో శుద్ధి చేసిన మంచి నీరు, అధునిక సౌకర్యాలతో టాయ్‌లెట్లు అందులో బకెట్లు, మగ్గులు, క్లాస్ రూములలో రంగు రంగుల బెంచీలు, ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు. ఆకట్టుకునేలా పాఠశాల కలర్.. ఇలా గత ఏడాది చూసిన పాఠశాలకు ప్రస్తుత పాఠశాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది.
పాఠశాలల్లో కల్పించే 9 రకాల సదుపాయాలను సీఎం జగన్ ఈ రోజు పరిశీలించారు. ఆ ఫొటోలు చూసిన వారు.. మళ్లీ పిల్లలై ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలనిపించేలా ఉన్నాయి. దేశ చరిత్రలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త అధ్యాయానికి జగన్ తెరతీయబోతున్నారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు ఏపీని అనుకరించే పరిస్థితులు రోజులు రాబోతున్నాయి.