Idream media
Idream media
వరదలు ఏపీని కూడా ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. సీఎం జగన్ ఆదేశాలతో పరిస్థితిని ముందుగా అంచనా వేసి తగిన చర్యలు చేపట్టడం ద్వారా నష్టాన్ని కొద్దిగా నివారించగలిగారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన వసతి ఏర్పాటు చేయడంలో ఏపీ ప్రభుత్వం చొరవ చూపింది.
అప్రమత్తం
తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తుండడంతో.. అది ఏ మేరకు ఉంటుందో ముందుగానే ఓ అంచనాకు వచ్చేలా గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ అప్రమత్తం చేశారు. ముంపు ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి రూ.500 చొప్పున ఇవ్వాలన్నారు. వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విషయాలు ఆరా తీసి సహకరించాలని చెప్పారు.
ప్రభావిత ప్రాంతాల్లో వేగవంతమైన చర్యలు
ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో యంత్రాంగం వేగంగా స్పందించింది. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించింది. కాలువలు, చెరువుల గండ్లు పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రహదారుల మరమ్మతులు తక్షణం చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వేర్వేరు జిల్లాల్లో మృతి చెందిన పది మంది కుటుంబాల వారికి వెంటనే పరిహారం చెల్లించాలని తెలిపారు. వారంలోగా నష్టంపై అంచనాలు పంపితే నివారణ చర్యలు మరింత వేగవంతం చేద్దామన్నారు. చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండడంతో.. ఈ పరిస్థితి మారేలా కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
వరద, బురదతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. అసలే కరోనా కాలం.. ఆపై వరద ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పరిసరాలు దుర్గంధంగా మారాయి. అలాగే మంచినీరు కూడా కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని పీహెచ్‌సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, క్లోరినేషన్ చేయాలని, వరదలు తగ్గాక పాము కాట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వరద తెచ్చిన అన్ని సమస్యలనూ క్షుణ్నంగా పరిశీలించి ఎక్కడికక్కడ పరిస్థితులు చక్కదిద్దేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.