iDreamPost
iDreamPost
చదువులు పూర్తి చేసిన విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొనేలా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. డిగ్రీ పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులను పూర్తిస్థాయి నైపుణ్యంతో తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. చదువుకొనే సమయంలోనే పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తారు. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. మూడేళ్ల డిగ్రీ విద్యార్థులు పదినెలలు ఇంటర్న్‌షిప్ చేసేలా కోర్సులను రూపొందించారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న సంస్థలతో అనుసంధానిస్తున్నారు.
పరిశ్రమల ఎంపిక..
ఇంటర్న్‌షిప్ కోసం 13 జిల్లాల్లో 27,119 పరిశ్రమలను ఎంపిక చేశారు. ఇలాంటి పరిశ్రమలు మైక్రో స్థాయివి 12,888, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 11,926, మధ్యతరహా పరిశ్రమలు 718, పెద్ద తరహావి 1,418, మెగా పరిశ్రమలు 169 ఉన్నాయి. విద్యార్థులు తమ కోర్సులతో సంబంధమున్న అంశాల్లో అందుబాటులో ఉన్న సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఇందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్‌లోని లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో వీటిని పొందుపరుస్తారు. ఇంటర్న్‌షిప్ కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఇందులో మాన్యుఫాక్చరింగ్, సర్వీసు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంటర్న్‌షిప్ ద్వారా ఆయా సంస్థలకు కూడా మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. ఉభయ తారకంగా ఈ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది.
Alao Read : Kaikala Sathya Narayana – కోలుకుంటున్న కైకాల… అండగా ఉంటామని కైకాల కుటుంబానికి జగన్ అభయం
జిల్లాలో ప్రత్యేక కమిటీలు
జిల్లాలవారీగా ఈ సంస్థలను ఎంపిక చేసి జాబితాను వెబ్‌సైట్లో పెడతారు. జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగానే జిల్లాలోని కంపెనీలను సంప్రదించి, ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేస్తాయి. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు కోఆర్డినేటర్ల సహకారంతో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సంస్థలు వాటికి అవసరమైన సంఖ్యలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పిస్తాయి. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. కాలేజీలు, పరిశ్రమలు, బిజినెస్ ఎంటర్‌ప్రయిజర్లను అనుసంధానం చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తారు. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థి పూర్తి నైపుణ్యం సాధించేలా చూస్తారు. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమం. మరోపక్క విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను పెంపొందించడానికి ఉన్నత విద్యా మండలి కమ్యూనిటీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. సమాజంపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు అక్కడి సమస్యలకు తాము నేర్చుకున్న విజ్ఞానం ద్వారా పరిష్కారాలను అన్వేషించేలా చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సమస్యలను అధిగమించే తత్వం ఏర్పడుతుంది.
డిగ్రీలో వృత్తి విద్యలు చదవనివారి కోసం
డిగ్రీలో వృత్తి విద్యలు చదవని విద్యార్ధులకు కూడా వివిధ అంశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఆర్ట్స్ విద్యార్థులకు 51, కామర్స్ విద్యార్థులకు 50, సైన్సు విద్యార్థులకు 38 ప్రాజెక్టులు ఉంటాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, ఉమెన్, యూత్ ఎంపవర్‌మెంటుతో పాటు వివిధ క్యాంపుల నిర్వహణ అంశాలతో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువు పూర్తిచేసి బయటకు వచ్చేనాటికి వారిని సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టారు. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానిస్తున్నారు.
Also Read : AP Floods, CM Jagan Letter – వరద ముంచెత్తింది.. ఆదుకోండి.. ప్రధానికి సీఎం లేఖ