iDreamPost
android-app
ios-app

ఉపాధ్యాయులకూ గుర్తింపు కార్డులు

ఉపాధ్యాయులకూ గుర్తింపు కార్డులు

నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇంగ్లీష్‌ మీడియం బోధన లాంటి విప్లవాత్మక సంస్కరణలను విధ్యాశాఖలో అమలు చేయబోతున్న ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు జారీ చేసి, నిరంతరం పర్యవేక్షణ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని సెకండరీ స్కూళ్లలోని 52,902 మంది ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు 26.45 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక కార్డు రూపొందించేందుకు 50 రూపాయల చొప్పన వెచ్చించనుంది.

ఉపాధ్యాయుని సమగ్ర వివరాలు గుర్తింపు కార్డులో పొందుపరచనున్నారు. ఉపాధ్యాయుని పేరు, ఫొటో, పాఠశాల పేరు, చిరునామా గ్రామం, మండలం, జిల్లా తదితర వివరాలతో కార్డు ముద్రించనున్నారు. సదరు గుర్తింపు కార్డును ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నప్పుడు తప్పక తమతోపాటే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎంఈవో, డీఈవో.. ఇతర అధికారులు పాఠశాలలను తనికీ చేసినప్పుడు ఉపాధ్యాయుల గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.