ప్రకృతి వనరుల సిరిసంపదలు.. ఆధ్యాత్మిక కేంద్రాలు.. అందరినీ అబ్బురపరిచే పర్యాటక సోయగాలు ఆంధ్రప్రదేశ్ సొంతం. కొండ ప్రాంతాలకు, జలపాతాలకు, పూల వనాలకు, బీచ్ లకు, చారిత్రకమైన ఆలయాలకు, పంచరామాలకు పెట్టింది పేరు. లెక్కకు మించి ప్రకృతి సంపద ఏపీ సొంతం. ఇప్పటికే ఉన్న పర్యాటక వైభవాన్ని మరింత వెలుగొందేలా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పర్యాటక శాఖ మరిన్ని చర్యలు చేపడుతోంది. కొత్త పాలసీలను, నూతన మార్గదర్శకాలను అందుబాటులోకి తెస్తోంది.
ఏపీ వైపు ఆకర్షితులయ్యేలా…
గత ప్రభుత్వం ప్రకటించిన అస్తవ్యస్త టూరిజం పాలసీతో విసిగిపోయిన పెట్టుబడిదారులు.. ప్రస్తుత సర్కారు ప్రవేశపెట్టబోయే కొత్త పాలసీతో మళ్లీ ఏపీ వైపు ఆకర్షితులు కానున్నారు. ఇందుకోసం ప్రోత్సాహకాలు.. రాయితీలతో పర్యాటక రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించేలా పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అనుమతులు, ప్రోత్సాహకాలు, రాయితీలు సులభంగా పొందేలా పర్యాటక వాణిజ్యం(రిజిస్ట్రేషన్, సౌకర్యాలు)కు సంబంధించి ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ఏపీ టూరిజం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేరళ, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసిన అనంతరం.. రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన సులభతరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాలను www.aptourism.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
నూతన మార్పుల్లో కొన్ని…
టూరు, బోట్ ఆపరేటర్లతో పాటు ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, రిసార్ట్సు, వాటర్ స్పోర్ట్స్ తదితర అనుబంధ రంగాల ఆపరేటర్లు రాష్ట్ర పర్యాటక శాఖతో అనుసంధానం. టూరు ఆపరేటర్లు, అనుబంధ రంగాలకు చెందిన వారు ప్రభుత్వం అందించే రాయితీలు, ప్రోత్సాహకాలు సులభంగా పొందేలా నిబంధనలు. పర్యాటక కార్యకలాపాలు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం రాష్ట్ర పర్యాటక శాఖలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. సేవా రంగానికి పెద్దపీట వేసేందుకు సులభతరమైన విధానాల్లో అనుమతులు. పర్యాటక రంగ అభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పర్యాటక వాణిజ్య ఆపరేటర్లు నమోదు చేసుకోవడానికి సరైన యంత్రాంగం, విధివిధానాలు అందుబాటులో లేవు. కొత్త మార్గదర్శకాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సేవా రంగాన్ని బలోపేతం చేసి స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కలుగుతాయనడంలో సందేహం లేదు.