iDreamPost
iDreamPost
త్వరలో కార్యనిర్వాహక వ్యవహారాలకు కేంద్ర స్థానంగా మారబోతున్న విశాఖలో ఆక్రమణల తొలగింపు పర్వం కొనసాగుతోంది. రెండు నెలల క్రితం మొదలయిన ఈ అంకంలో ఇప్పటికే పలువురు నేతల కబ్జాల పర్వం తెరమీదకు వచ్చింది. అందులో మాజీ మంత్రి గంటా, మాజీ ఎంపీ సబ్బం హరి, టీడీపీ నేత హర్షవర్దన్ వంటి వారి భూదందాలు, గీతం పేరుతో కబ్జాల పర్వం సహా ఇతర వ్యవహారాలను జీవీఎంసీ వెలుగులోకి తెచ్చింది. తాజాగా అదే జాబితాలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సాగించిన దందాకు చెక్ పెట్టారు.
విశాఖలోనే ఖరీదైన ప్రాంతంలో ఉన్న రిషికొండ ఏరియాలో గెడ్డను ఆక్రమించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వ్యవహారానికి జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు చెక్ పెట్టారు. స్వయంగా ఎమ్మెల్యే ఆక్రమణలకు పాల్పడిన విషయం అధికారికంగా ధృవీకరించిన సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే చెర నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించారు. అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కాజేసిన వైనాన్ని నిర్ధారించుకున్న తర్వాత వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రజల ఆస్తి ప్రభుత్వపరం చేసినట్టయ్యింది.
అదే సమయంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వ్యవహారానికి కూడా ముగింపు పడింది. ఆక్రమణలు చేసి అడ్డగోలగా భూదందాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించిన ప్రభుత్వం దానికి అనుగుణగా వ్యవహరిస్తోంది. ఆనందపురం మండలం లో దాదాపు 300 ఎకరాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను కాజేసి, కోట్లకు అమ్ముకోవడానికి సిద్ధమయిన మాజీ ఎమ్మెల్యే చర్యను అదికారులు అడ్డుకున్నారు.
ఇప్పటికే విశాఖలో భూదందా వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబు హయంలో ఆయన పార్టీకి చెందిన నేతలంతా యధేశ్ఛగా కనిపించిన ప్రతీ ప్రభుత్వ ఆస్తిని కాజేసినట్టు కనిపిస్తోంది. నివాస ప్రాంతాల్లో కామన్ స్థలాల నుంచి శివారు ప్రాంతాల్లో వందల ఎకరాలను ఆక్రమించిన వైనం వెలుగులోకి వచ్చింది. గీతం వంటి యూనివర్సిటీలో గాంధీ పేరు పెట్టుకుని ప్రజా సంపదను ఆక్రమించిన వైనం బయటపడింది. దాంతో తదుపరి చర్యలు ఇంకా ఎవరి మీద ఉంటాయోననే చర్చ మొదలయ్యింది. ఇప్పటి వరకూ కీలక నేతల గుట్టు కూడా రట్టు చేస్తున్న తరుణంలో ఆక్రమణదారులు ఎవరైనా సరే సహించేది లేదనే సంకేతం ప్రభుత్వం వెల్లడించినట్టయ్యింది.