Idream media
Idream media
పరిశ్రమలు తరలిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రావడం లేదు. ఏపీలో పరిస్థితి బిహార్ కన్నా దారుణంగా ఉంది. కియా మోటార్స్ వెళ్లిపోతోంది. పరిశ్రమలకు భూములు ఎవరూ ఇవ్వడం లేదు.. ఇలా ఏడాది మూడు నెలలుగా ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన విష ప్రచారం పటాపంచలైంది. ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. తన పని తాను చేసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ పనితీరుకు సరైన గుర్తింపు లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(సులభతర వ్యాపార నిర్వహణ)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ఉత్తర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఉన్నాయి.
కేంద్రం ప్రకటించిన తాజాగా గణాంకాలు.. ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి అద్దం పడుతోంది. నూతన పారిశ్రామిక విధానంతో వేగవంతమైన అనుమతులు, రాయితీలు, కరోనా కష్టకాలంలో సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు చేదోడు.. వంటి విధానాల ద్వారా పారిశ్రామిక రంగాన్ని జగన్ సర్కార్ ఆదుకుంది. ఓ పక్క సంక్షేమంతోపాటు అభివృద్ధిపై కూడా బలంగా దృష్టి పెట్టిందని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వచ్చిన నంబర్ ఒన్ ర్యాంకు చెబుతోంది.
గతానికి భిన్నంగా ఈ సారి ర్యాంకుల ప్రకటనకు నూతన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన నివేదిక ద్వారా ర్యాంకులు ప్రకటించగా.. ఈ సారి పారిశ్రామిక వేత్తలు, వినియోగదారులతో సర్వే నిర్వహించారు. వారు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. సంక్షేమ పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయో.. లబ్ధిదారులను అడిగితేనే తెలుస్తుంది. అలాగే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, ప్రొత్సాహం లభిస్తుందనేది పారిశ్రామికవేత్తలు ఇచ్చే సమాచారమే సరైన కొలమానంగా పరిగణించవచ్చు. నూతన విధానంలో ప్రకటించిన ర్యాంకులు ఆయా రాష్ట్రాల ప్రగతికి సిసలైన తార్కాణాలుగా నిలిస్తున్నాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.