iDreamPost
android-app
ios-app

జగన్ ఏలూరు పర్యటన – పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం

జగన్ ఏలూరు పర్యటన – పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం

కరోనా వైరస్ కారణంగా చాలాకాలంగా జిల్లాల పర్యటనలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా తక్కువ సార్లు బయటకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శంకుస్థాపన కార్యక్రమాలకు స్వయంగా హాజరయ్యారు.

ముఖ్యమంత్రి జగన్ ఉదయమే విజయవాడ నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి ఏలూరు లోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో దిగారు. ఏలూరు పర్యటనలో భాగంగా సుమారు రూ.355 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా దశాబ్దాల తరబడి ఏలూరు నగర ప్రజలకు సమస్యగా మారిన తమ్మిలేరు వరద ముంపు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు నిర్మించతలపెట్టిన రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేశారు.

తమ్మిలేరు వాగు రక్షణ గోడ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు గవరపేటలోని శ్రీ సూర్య కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన ఏలూరు మాజీ మేయర్ షేక్ నూర్జహాన్‌, ముజుబుర్‌ రెహమాన్ దంపతుల కుమార్తె వివాహానికి హాజరైన సీఎం వైయస్‌.జగన్‌ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు.. ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గని భరత్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా,  గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజుతో పాటు తదితరులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.