iDreamPost
iDreamPost
విశాఖలో ప్రభుత్వ అతిధి గృహం నిర్మాణంపై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం కాపులుప్పాడలో గ్రేహౌండ్స్‌కు చెందిన 300 ఎకరాల్లో 30 ఎకరాలను స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు సచివాలయాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ అమరావతి జేఏసీ తరుపున తిరపతిరావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తీసుకుని వచ్చిన రాజధాని వికేంద్రీకరణ అంశం కోర్టు పరిధిలో ఉండగానే విశాఖలో అతిధి గృహం నిర్మాణం చేపట్టిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ గెస్ట్ హౌస్ విశాఖకు సచివాలయ తరలింపులో అతర్భాగం అని వారు ఆరోపించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ తమ వాదనలు వినిపిస్తూ విశాఖపట్నంలో నిర్మించ తలపెట్టిన అతిథి గృహానికి రాజధానికి ఎలాంటి సంబంధం లేదని హైకోర్టుకు తెలిపారు . అది స్వతంత్ర నిర్ణయమని, ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వాలని, అతిథి గృహం స్వరూపం, విస్తీర్ణం, గదుల సంఖ్య, ప్లాన్ తదితర విషయాల్లో జోక్యం చేసుకునే పరిధి అధికరణ 226 కింద హైకోర్టుకు లేదని ఏజీ నివేదించారు.
ఇరువైపులా వాదనలు విన్న ఏపీ హైకోర్టు దర్మాసనం విశాఖలో ప్రభుత్వం గ్రెస్ట్ హౌస్ నిర్మించే అంశంపై స్టేని విధించింది. ఈ నేపధ్యంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఆదేశాలను సవాల్ చేస్తు జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు పరిశీలించి విచారణకు స్వీకరించింది.