iDreamPost
android-app
ios-app

జగన్ కొత్త దారి, ఇకపై ఏపీ సీఎం దృష్టి అటు వైపే

  • Published Jul 10, 2020 | 3:05 PM Updated Updated Jul 10, 2020 | 3:05 PM
జగన్ కొత్త దారి, ఇకపై ఏపీ సీఎం దృష్టి అటు వైపే

ఆంధ్రప్రదేశ్ కొత్త దారి పడుతోంది. అభివృద్ధి మార్గాన పయనించే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్టుగా సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తొలి ఏడాది ఆయన పాలనా తీరుపై వినిపించిన ఎక్కువ కామెంట్స్ లో సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే, అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ తరుణంలో వైఎస్ జగన్ వ్యూహం మార్చారు. సంక్షేమ మంత్రం పాటిస్తూనే, అభివృద్ధి పంథా అవలంభిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కరోనా వేళ కూడా తన ప్రయత్నాలను ఆచరణలో పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు రంగాల్లో వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. త్వరలో అవి మరింత విస్తృతపరిచే యత్నం మొదలయ్యింది.

చంద్రబాబుని మీడియాలోని ఓ సెక్షన్ ప్రచారంతో విజనరీగా మార్చేశారు. కానీ వాస్తవానికి చంద్రబాబు విజన్ ఫలితాలు ఎక్కడా ఆచరణలో కనిపించలేదు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ అమరావతి మాదిరిగానే అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. దాంతో ఆయన విజనరీ అనే ప్రచారానికి, వాస్తవానికి పొంతనలేదని చాలామంది భావించాల్సి వస్తోంది. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీ, వైఎస్సార్ హయంలో పురుడు పోసుకున్న రింగ్ రోడ్డు వంటి వాటిని కూడా తన ఖాతాలో వేసుకుని ఆయన ప్రచారం సాధించారు. కానీ వాస్తవానికి ఇప్పుడు జగన్ పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్టు కనిపిస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రచారానికి దూరంగా ఆయన తన విధానాలను అమలులో తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

రాబోయే నాలుగేళ్ల కాలంలో వివిధ పథకాలకు తగిన కేటాయింపులు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే విద్య, వైద్య రంగాల్లో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం చేస్తున్న వ్యయం ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసేందుకు దోహదం చేస్తోంది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ప్రభుత్వ విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్న సీఎంగా జగన్ కనిపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పాఠశాలల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ఇక వైద్య రంగంలో కూడా జగన్ ప్రభుత్వం విస్తృత ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే మొదటి విడత నాడు నేడు పథకంలో 15000 పైగా స్కూళ్ల అభివృద్ధి కోసం 3600 కోట్లు కేటాయించారు. వాటి మూలంగా పలు స్కూళ్ల రూపురేఖల్లో పెద్ద మార్పులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విద్యారంగం వైపు అంతా చూసేందుకు దోహదం చేస్తోంది.

ఇక రాబోయే కాలంలో రెండు, మూడు విడతల్లో నాడు – నేడు కార్యక్రమాల కోసం మరో 7700 కోట్లు కేటాయింపులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో మొత్తం పాఠశాలలన్నీ సమూల మార్పులతో ప్రైవేటు స్కూళ్లకు పోటీగా నిలవడం ఖాయంగా చెప్పవచ్చు. ఇక వాటితో పాటుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు,ఒక సూపర్ స్పెషాలిటీ, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక మానసిక చికిత్స హాస్పిటల్ కోసం 6657 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. దాంతో అవన్నీ రాబోయే నాలుగేళ్ల కాలంలో పూర్తయితే ప్రభుత్వ వైద్యం విస్తరిస్తుంది. ప్రజారోగ్యరంగం బలపడుతుంది. ప్రజల ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. ఇప్పటికే గుంటూరులో క్యాన్సర్ చికిత్స ల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రి అందులో భాగమే ఇక ప్రస్తుతం ఉన్న 11 హాస్పిటల్స్,6 అనుబంధ సంస్థలు,7 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అభివృద్ధి కోసం మరో 6099 కోట్లు వ్యయం చేయబోతున్నారు. వాటిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.

ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులను బలోపేతం చేయడం, కొత్తగా వైద్య సేవలందించేందుకు కొత్త ఆసుపత్రులను నిర్మాణం ఏకకాలంలో చేపట్టేలా ప్రభుత్వం ముందుకెళుతుంది. ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హాస్పిటల్స్ లో నాడు- నేడు కోసం మరో 1236 కోట్లు కేటాయించబోతున్నారు. దాంతో వైద్య ఆరోగ్యరంగంలో మధ్యస్థాయి ఆసుపత్రుల అభివృద్ధి జరగుతుందని ఆశించారు. ఇక ప్రాధమిక స్థాయిలో పీహెచ్ సీల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం అయ్యింది. కొత్తవి నిర్మాణం చేయడం, ఉన్న వాటిని పునరుద్ధరణ చేయడం కోసం మరో 671 కోట్లు కేటాయించే లక్ష్యం పెట్టుకున్నారు. తద్వారా ప్రజారోగ్యానికి భరోసా ఖాయం అని నమ్ముతున్నారు. అన్నింటికీ మించి విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు మరో చారిత్రక నిర్ణయం కాబోతోంది. గ్రామీణ సచివాలయాల ద్వారా పాలనను ప్రజలకు చేరువలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 11197 విలేజ్ క్లినిక్ ల కోసం 1745 కోట్లు కేటాయించబోతోంది. అవన్నీ అందుబాటులోకి వస్తే నాలుగైదు గ్రామాల పరిధిలో ఓ వైద్యుడు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.

ఇక సాగునీరు, తాగునీటి విషయంలోనూ ప్రాధాన్యతాంశాలుగా భావిస్తోంది. జలయజ్ఞం ద్వారా తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేయడంతో పాటుగా ఇతర ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికను రెడీ చేసింది. ప్రధానంగా పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. కనీసంగా 2022 నాటికి పోలవరం కుడి, ఎడమ కాలువలు గోదావరి జలాలతో కళకళలాడే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక వెలిగొండ లాంటి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి కోసం కూడా పట్టుదలతో ఉంది. రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యతా క్రమంలో ముందుకెళుతున్నారు. మొత్తం నాలుగేళ్లలో 98వేల కోట్ల బడ్జెట్ ని సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించేందుకు సిద్దమయ్యారు.

తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు వాటర్ గ్రిడ్ విస్తృతం చేయబోతున్నారు. అందులో తాగునీటి ఎద్దడి ఉన్న వివిధ జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం,తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మెట్ట, ఏజన్సీ ప్రాంతాలు, గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశంజిల్లా కనిగిరి, చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం,అనంతపురం జిల్లాలో వాటర్ గ్రిడ్ పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. దానికోసం 19088 కోట్లు కేటాయించాలని ప్రణాళికలు వేశారు. ఇలా కీలకమైన మౌలిక సమస్యలన్నీ తీర్చే యోచనలో ప్రభుత్వం ముందుకెళుతుంది. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం సామాన్యులకు అవసరం అయిన ప్రధాన అవసరాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేపడుతోంది.

ఇక స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ నిర్మాణం, ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఓ సెంటర్ ఏర్పాటు వంటివి కూడా లక్షిత సమయంలో పూర్తి చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక స్థానిక యువతకు ఉపాధి పెంచేలా కొత్త పరిశ్రమల కోసం ఆశావాహక ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమల శాఖ వివిధ కార్పోరేట్ కంపెనీలతో చర్చలు సాగిస్తోంది. వాస్తవానికి కరోనా అడ్డంకి లేకుంటే ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఎంవోయూల వరకూ వచ్చి ఉండేవని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇక ఏడాది చివరి నాటికి కొన్ని పరిశ్రమలతో ఒప్పందాలు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తద్వారా అభివృద్ది కొత్త పుంతలు తొక్కించేందుకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దాంతో తొలి ఏడాది సమీక్షకులు చెప్పినట్టుగా అభివృద్ధిని జగన్ విస్మరించలేదనే వాస్తవాన్ని ఆచరణ ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నంలో ప్రభుత్వం తలమునకలై ఉంది. తద్వారా నిజమైన విజనరీగా జగన్ నిలిచిపోయేందుకు పట్టుదలతో ఉన్నట్టు చెబుతున్నారు.