iDreamPost
android-app
ios-app

హైకోర్ట్ స్టేటస్ కో ప్రభుత్వానికి అడ్డుకాదన్నట్టేనా

  • Published Aug 14, 2020 | 11:11 AM Updated Updated Aug 14, 2020 | 11:11 AM
హైకోర్ట్ స్టేటస్ కో ప్రభుత్వానికి అడ్డుకాదన్నట్టేనా

మూడు రాజధానుల అంశంలో ఏపీ హైకోర్టు మరోసారి తన నిర్ణయం ప్రకటించింది. మరో రెండు వారాల పాటు స్టేటస్ కో ప్రకటించేందుకు సిద్ధమయ్యింది. దాంతో ఈనెల 27వ తేదీ వరకూ స్టేటస్ కో ఆర్డర్ కొనసాగబోతోంది. దానిని తొలగించాలని ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కోరినప్పటికీ హైకోర్ట్ దానిని నిరాకరించింది.

అయితే స్టేటస్ కో విషయంపై న్యాయనిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హైకోర్ట్ స్టే విధించలేదని, కేవలం స్టేటస్ కో మాత్రమే విధించిందనే విషయాన్ని గుర్తు చేశారు. స్టే విధించిన పక్షంలో యథాతథ స్థితిలో ఎటువంటి మార్పులుండేందుకు అవకాశం లేదని చెబుతున్నారు. అదే సమయంలో స్టేటస్ కో ఆర్డర్ ప్రకారం ఇప్పటికే చట్ట రూపం దాల్చిన మూడు రాజధానుల అంశం అమలులో ఉన్నట్టుగానే భావిస్తున్నారు. స్టే ఇవ్వాలని పిటీషనర్ కోరినప్పటికీ కేవలం స్టేటస్ కో వర్తిస్తుందని మాత్రమే వెల్లడించడం ద్వారా మూడు రాజధానుల విషయంలో గవర్నర్ ఆమోదంతో చట్టరూపం దాల్చిన అంశానికి పెద్దగా ఆటంకాలు లేనట్టుగానే చెప్పాలని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే ఈ స్టేటస్ కో ఆర్డర్ ని తొలగించాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించింది. అయితే అక్కడ సాంకేతిక లోపాలతో పిటీషన్ విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో వేసిన ఎస్ ఎల్ పీ విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో అక్కడే స్టేటస్ కో ఆర్డర్ ని తొలగించేందుకు అనుగుణంగా ప్రభుత్వం న్యాయపోరాటం సాగించబోతున్నట్టు చెబుతున్నారు.

అదే సమయంలో మూడు రాజధానుల అంశంలో శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ శూన్యమాసం రావడంతో ప్రభుత్వం వెంటనే అలాంటి ఆలోచన చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తున్నాయి. శూన్యమాసంతో పాటుగా ఇతర సమస్యలన్నీ తొలగి దసరా నాటికి మళ్ళీ మంచి ముహూర్తం చూసుకోవడానికి అనుగుణగా సర్కారు సన్నద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఆలోగా వైజాగ్ లో పాలనకు అనుగుణంగా భవంతుల ఎంపిక, ఇతర ఏర్పాట్లన్నీ పూర్తి చేసేందకు మార్గం సుగమం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా తాత్కాలిక సమస్యలకు ముగింపు పలికి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాల దిశలో ఈ సమయం తోడ్పడుతుందని భావిస్తున్నారు. దాంతో ప్రస్తుతం హైకోర్ట్ స్టేటస్ కో ప్రకటించినప్పటికీ ప్రభుత్వ కార్యకలాపాలకు పెద్ద ఆటంకం లేనట్టుగానే భావించాలని అంటున్నారు.