iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ కూర్పులో భారీ మార్పులుంటాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దానికి అనుగుణంగా ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. గురువారం జరిగే క్యాబినెట్ భేటీ ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులకు చివరిదేననే వాదన కూడా వస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చే నెలలో మరోసారి సమావేశమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నవంబర్ 15 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.
మే నెలల కేవలం ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ నిర్వహించారు. కోవిడ్ పరిస్థితుల్లో బడ్జెట్ ఆమోదం కోసం ఆ సమావేశాలు అత్యవసరంగా జరపాల్సి వచ్చింది. ఆరు నెలలు నిండుతున్న తరుణంలో వచ్చే నెల 19లోపు అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంటుంది.దానికి ముందే మండలిలో ఖాళీ స్థానాలకు ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి ఏపీ శాసనమండలి 14 సీట్ల భర్తీకి ఈసీ సిద్ధమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణా సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల 2తో ముగుస్తుంది. ఆ తర్వాత మండలి ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ఛాన్స్ ఉంది. వాటిని కూడా నవంబర్ 20 నాటికి పూర్తి చేస్తారని చెబుతున్నారు. దాంతో ఏపీలో స్థానిక సంస్థల, ఎమ్మెల్సీ కోటాల ఖాళీ సీట్లు భర్తీ జరిగే అవకాశం ఉంది.కోవిడ్ కారణంగానే మండలి ఎన్నికలను కూడా జూన్ నుంచి వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక వచ్చే నెలలో జరిగితే ఆశావాహుల కోరిక నెరవేరేందుకు మార్గం సుగమం అవుతుంది.
అసెంబ్లీ సమావేశాలు, మండలి ఖాళీ స్థానాల భర్తీతో నవంబర్ సందడిగా ఉండబోతోంది. ఆ తర్వాత వచ్చే నెలాఖరుకి క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో భారీ మార్పులు ఖాయమని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు దానికి అనుగుణంగా ప్రకటనలు కూడా చేశారు. దాంతో పార్టీ బాధ్యతల్లోకి మారబోతున్న ప్రస్తుత మంత్రులెందరు, కొత్తగా జగన్ టీమ్ లో చేరబోయే మంత్రులెవరనే చర్చ సాగుతోంది. వాటన్నింటికీ అసెంబ్లీ సమావేశాల తర్వాత నవంబర్ ఆఖరులో ముహూర్తం పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆశావాహుల్లో సందడి జోరందుకుంటోంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు
Also Read : AP Cabinet -ప్రస్తుత క్యాబినెట్ కి ఇదే చివరి సమావేశం?మంత్రివర్గ మార్పు?