ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ ఏడాదిలో తొలిసారిగా ఈ రోజు జరుగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరుగనున్నది. మొత్తం 32 అంశాలతో కేబినెట్ అజెండా నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు కనిపిస్తోంది. కరోనా మహమ్మారి సంక్రమణ, పీఆర్సీ వివాదం ప్రధాన ఎజెండాలుగా కేబినెట్ భేటీ ఉంటుందని చెబుతున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే కొన్ని ఆర్డినెన్సులకు ఆమోద ముద్ర వేయనున్నట్లు కూడా తెలుస్తోంది.
సంక్షేమ కేలెండరుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుందని, సినిమా టికెట్ల వ్యవహారం మీద కూడా చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. పీఆర్సీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవి మాత్రమే కాక కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కట్టడి చర్యలపై కార్యాచరణ మీద ఒక నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు విత్తన, ఎరువుల సరఫరా కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంధనశాఖకు సంబందించి మరో రెండు అంశాలను చర్చించనున్నట్టు కూడా చెబుతున్నారు. లాక్ డౌన్, పాఠశాలకు సెలవులు, పరీక్షలు తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
అంతే కాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు.. ఇతర ప్రతిపాదనలపై కూడా మంత్రులు చర్చించనున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలు, మూడు రాజధానుల కోసం తీసుకుని రాదలిచిన కొత్త బిల్లు.. ప్రస్తావనకు కూడా రావచ్చని తెలుస్తోంది. భేటీ జరిగిన తరువాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read : క్యాబినెట్ భేటీలో ఆ రెండు అంశాలపై నిర్ణయముంటుందా?