iDreamPost
android-app
ios-app

నేడు కేబినెట్ భేటీ – మరి కొన్ని రత్నాలకు ఆమోదం

నేడు కేబినెట్ భేటీ – మరి కొన్ని రత్నాలకు ఆమోదం

ఇప్పటికే వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా వంటి పధకాలు అమలు చేసిన జగన్ సర్కార్.. మరి కొద్దీ రోజుల్లో మరిన్ని పధకాలను ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. నవరత్నాల అమలే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు జరగబోవు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ‘వైఎస్‌ఆర్‌ నవశకం’ పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు గాను కొత్తగా రూపొందించిన అర్హత మార్గదర్శకాలకు బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్‌ సమావేశం జరగనుంది.

సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలు..

– ‘జగనన్న విద్యా దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున ఇవ్వాలన్న ప్రతిపాదనలకు, డిగ్రీ ఆ పైన కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్‌ ఫీజుల కింద ఏటా రూ.20వేల చొప్పున ఇచ్చే ‘జగనన్న వసతి’కి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు.
– టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానే కేబినెట్‌లో ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లులో సవరణలు చేయనున్నారు.
– పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్‌) విధానంలో ఏర్పాటుచేసిన పోర్టులకు సంబంధించి ఆడిట్‌ కోసం సంస్థలను ఎంపికచేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
– సీఆర్‌డీఏలో ఏ ప్రాజెక్టులను చేపట్టాలి.. వేటిని చేపట్టకూడదనే అంశంపై చర్చించే అవకాశంఉంది.
– వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.