iDreamPost
android-app
ios-app

అసెంబ్లీ సమావేశాలు ఒక నాడు అలా..నేడు నిస్సారంగా ఇలా..

  • Published Nov 30, 2020 | 1:45 AM Updated Updated Nov 30, 2020 | 1:45 AM
అసెంబ్లీ సమావేశాలు ఒక నాడు అలా..నేడు నిస్సారంగా ఇలా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలంటే అనేక మందికి ప్రత్యేక ఆసక్తి. ముఖ్యంగా పాలక, ప్రతిపక్ష నేత మధ్య వాడి, వేడి సంవాదాలకు నెలవుగా ఉంటుంది. విస్తృత చర్చలు, విశేష అంశాల కలబోతగా ఉంటుందనే అభిప్రాయం. కానీ తీరా ప్రస్తుతం అలాంటి పరిస్థితికి అవకాశం ఉండడం లేదు. ఒకనాడు ఎంతో మేథస్సు కలిగిన నేతల కలయికతో నిండుదనంగా కనిపించిన ఏపీ అసెంబ్లీ ఇప్పుడు అందుకు విరుద్దంగా మారింది. అవగాహన, అనుభవం లేని నేతల తీరుతో అభాసుపాలవుతోంది. సభలో చర్చల కన్నా రచ్చకే ప్రాధాన్యతనిచ్చే వారి సంఖ్య పెరగడం దానికి కారణం. అందులో విపక్షం పేలవంగా మారిపోవడం మరింత ప్రధానాంశమయ్యింది. అధికార పక్షం నుంచి కొందరు నేతలు అవగాహనతో వ్యవహరిస్తున్నా, ప్రతిపక్షంలో అరిచే నేతలే తప్ప వివరణ ఉన్న వారు కరువు కావడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాల పట్ల ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతోంది.

1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు మాత్రమే దక్కాయి. అయినా మొక్కవోని పట్టుదలతో ఆపార్టీ సాగింది. అప్పట్లో 294 మంది సభ్యులున్న ఉమ్మడి రాష్ట్ర సభలో 26 మంది అంటే చాలా నామమాత్రం. అయినా పి జనార్థన్ రెడ్డి సీఎల్పీ లీడర్ గా ఇతర కాంగ్రెస్ నేతల చొరవతో నాటి చంద్రబాబు ప్రభుత్వానికి అనేక మార్లు చిక్కులు తప్పలేదు. కీలకమైన ఏలేరు అవినీతి కుంభకోణం వంటి అంశాలపై సభలో నిలదీసి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన అనుభవం ఆనాడు ఉంది. అనేక సందర్భాల్లో కరువు, ఇతర సమస్యల మీద కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం నీళ్లు నమలాల్సి వచ్చేది. అంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రతిపక్షం తీరు పూర్తి పేలవంగా మారిపోయింది.

టీడీపీ తరుపున 23మంది గెలిచారు. వర్తమాన రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల్లో నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు కి దూరమయ్యారు. ఇక మిగిలింది 19 మంది. అందులో ఇద్దరు నేతలు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇక 17 మందిలో బాలకృష్ణ వంటి వారు సభకి వచ్చేది అంతంతమాత్రమే. మరికొందరికి అనారోగ్యం, ఇతర కారణాలు తోడు కావడంతో నికరంగా టీడీపీ తరుపున కనిపించేది 15 మంది లోపు. అందులో అవగాహనతో అధికార పక్షాన్ని నిలదీయగల స్తోమత ఉన్న నాయకులే కనిపించడం లేదు. అచ్చెన్న అరుపులు, బుచ్చయ్య బెదిరింపుల, నిమ్మల రామనాయుడి రాద్ధాంతం, నిమ్మకాయల రాజప్ప అవగాహనా రాహిత్యం తప్ప టీడీపీ వైపు నుంచి విషయంపై మాట్లాడే నేతలే కరువయ్యారు. ఇదే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ప్రహసనంగా మారేందుకు దోహదమయ్యింది.

చంద్రబాబు ఉపన్యాసాలు ఎంత బోరింగ్ అనిపిస్తాయో అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు చెల్లుబాటు అయినప్పటికీ ప్రతిపక్షంలో ప్రస్తుతం ఆయన మాటలను పార్టీ కార్యకర్తలే పూర్తిగా వినలేని పరిస్థితి వచ్చింది. ఇక సభలో పాలకపక్ష సభ్యులు ఎందుకు వింటారన్నది ప్రశ్న. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం పూర్తి బలహీనంగా ఉండడంతో ఏపీ అసెంబ్లీలో చర్చలు సారవంతంగా సాగడం లేదు. రాజకీయ ఆసక్తి ఉన్న వారికి ఇది నిరాశ కలిగించే అంశం. గత అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యుల్లో పలువురు పాలక పక్షాన్ని నిలదీయడంలో సక్సెస్ అయిన అనుభవాలున్నాయి. చివరకు తిట్లు, బూతులు ద్వారా బయటపడేందుకు అప్పట్లో చంద్రబాబు అనుచరులు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. ప్రస్తుత సభలో కూడా బుగ్గన, ధర్మాన సహా అనేక మంది తమ వాగ్దాటితో ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే నేతలున్నారు. దాంతో పాలకపక్షానికి ధీటుగా నిలబడే నేతలు కరువయిన ప్రతిపక్షానికి అసెంబ్లీ భారంగా మారుతోంది. అధికారాన్ని నిలదీయడానికి వాడుకోవాల్సిన సభా సమావేశాలు చివరకు తమను బద్నాం చేసేందుకు వాడుకుంటున్నారనే బెంగ మొదలయ్యింది. దాంతో వర్తమానంలో ఏపీ అసెంబ్లీ పరిస్థితి అంత సంతృప్తికరంగా కనిపించడం లేదని అంతా భావించాల్సి వస్తోంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişJojobet Güncel GirişMarsbahisJojobetHoliganbet