iDreamPost
android-app
ios-app

Ap Assembly – ఏడురోజుల పాటు ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు..

  • Published Nov 18, 2021 | 6:23 AM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Ap Assembly – ఏడురోజుల పాటు ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు ఏడు రోజుల పాటు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఒక్క రోజు సమావేశాలకు సభ ప్రారంభమయ్యింది. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం తెలిపింది. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ తరుపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాలు పొడిగించాలని విపక్షం కోరడంతో వెంటనే ప్రభుత్వం అంగీకరించింది. వాస్తవానికి మండలికి కొత్త సభ్యులు రాబోతున్న తరుణంలో వారు వచ్చిన తర్వాత వచ్చే నెలలో సుదీర్ఘకాలం పాటు సభను జరపాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రతిపక్షం దానిని కూడా రాజకీయం చేసేందుకు సిద్ధపడడంతో చెక్ పెట్టేందుకు అనుగుణంగా సర్కారు ముందుకొచ్చింది.

అసెంబ్లీ సమావేశాలు ప్రతీ ఆరునెలలకు ఒకసారయినా సమావేశం కావాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా మే 19 తర్వాత సభ సమావేశం కాలేదనే కారణంతో గురువారం అత్యవసరంగా ఒక్క రోజు సమావేశాలకు సిద్ధం చేశారు. అయితే అనూహ్యంగా బీఏసీలో తీసుకున్న నిర్ణయంతో ఈ సమావేశాలు 26వ తేదీ వరకూ జరగబోతున్నాయి. మధ్యలో 20,21 తేదీలను సెలవు దినాలుగా నిర్ణయించారు. దాంతో సమావేశాలు వారం పాటు కొనసాగబోతున్నాయి.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలకమైన ఆర్డినెన్స్ ఆమోదానికి సిద్ధం చేసింది. మండలిలో కూడా పలు అంశాలు చర్చకు రాబోతున్నాయి. అయితే విపక్షం ఊహించని సమావేశాల పొడిగింపునకు ప్రభుత్వం సిద్ధం కావడం టీడీపీ నేతలను ఖంగుతినిపించింది. అసలే కష్టకాలంలో ఉన్న టీడీపీకి ఈ సమావేశాల్లో అధికార పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇప్పటికే మండలిలో తొలినాడే టీడీపీ నేతలు వాకౌట్ చేశారు. అయినా సభ సాగిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కూడా టీడీపీ నేతలకు సమావేశాల పొడిగింపు పెద్ద సమస్యగా మారడం ఖాయంగా చెప్పవచ్చు. చంద్రబాబు వాటిని ఎలా ఎదుర్కుంటారన్నది ఆసక్తకరం.

Also Read :  AP Assembly Live : ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ, స‌భ ముందుకు కీల‌క బిల్లులు