iDreamPost
iDreamPost
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తు గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 1956లో రూపుదిద్దుకున్న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కు ఉండేది. అలాగే కశ్మీర్ కు చెందిన మహిళ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే…ఆమెకు ఆమె పిల్లలకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో స్థిరాస్తులు ఉండడానికి హక్కు ఉండేది కాదు.
అయితే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో జమ్ము కశ్మీర్‌లో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా భూములు కొనవచ్చు అని పేర్కోంటూ కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
జమ్మూ కాశ్మీర్ లోని పలు చట్టాలకు చేసిన సవరణల్లో ఈ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణలు ఆమోదనీయం కాదని రాజ్యాంగానికి వ్యతిరేకంగా తొలుత జమ్మూ కాశ్మీర్ పౌరుల హక్కులను కాలరాస్తూ ఆర్టికల్ 370 రద్దు చేసిన ప్రభుత్వం దానికి కొనసాగింపుగా ఇప్పుడు కాశ్మీర్లోని వనరులని కొల్లగొట్టేందుకు కాశ్మీర్ ను అమ్మకానికి పెట్టిందని పీడీపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ తమ నిరసనని వ్యక్తపరిచారు.