iDreamPost
android-app
ios-app

షూటింగులకు వరస షాకులు

  • Published Jul 25, 2020 | 6:52 AM Updated Updated Jul 25, 2020 | 6:52 AM
షూటింగులకు వరస షాకులు

లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి ఇది అయిదో నెల. ఇప్పుడీ సంక్షోభం వంద రోజులు దాటి సిల్వర్ జూబ్లీ వైపు పరుగులు పెడుతోంది. ఎప్పటికి తెరిపిస్తుందో అర్థం కావడం లేదు. మరోవైపు స్టార్ హీరోలు సెట్స్ కు వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. వాళ్ళ పాయింట్ లో న్యాయముంది. హైదరాబాద్ లో కరోనా కేసులు సగం కూడా తగ్గుముఖం పట్టడం లేదు. నెల రోజులుగా గ్రోత్ రేట్ బంగారం ధరలా పెరుగుతూనే ఉంది. సీరియల్స్ నటీనటులకు అడపాదడపా పాజిటివ్ కేసులు నమోదయినప్పటికీ వాళ్ళను మాత్రం హోమ్ క్వారెంటైన్ కి పంపించి మిగిలినవాళ్లతో హడావిడి లేకుండా షూటింగులు చేస్తున్నారు. దాదాపు అన్ని సీరియళ్లు, రియాలిటీ షోలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి

ఎటొచ్చి చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాల నిర్మాణం మాత్రం జరగడం లేదు. కొంత ప్యాచ్ వర్క్ ఉన్న మీడియం రేంజ్ చిత్రాలు తప్ప అన్ని యూనిట్లు ఇళ్లకే పరిమితమయ్యాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత నిర్మిస్తున్న వెబ్ సిరీస్ షూట్ లో ఒక వ్యక్తికి పాజిటివ్ డిటెక్ట్ కావడంతో దాన్ని ప్రస్తుతానికి ఆపేసి 14 రోజుల బ్రేక్ ఇచ్చారట. మిగిలినవాళ్లకూ టెస్టులు చేయిస్తున్నారని వినికిడి. మొన్నటికీ మొన్న బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తానికి వైరస్ రావడం ఇంకా మర్చిపోనే లేదు ఇప్పుడిలాంటి పరిణామాలు ఖంగారు పుట్టిస్తున్నాయి. నిజానికి జూలై నెలాఖరుకు కేసులు తగ్గుముఖం పడితే ఆగస్ట్ రెండు లేదా మూడో వారం షూటింగులు ప్లాన్ చేసుకునేలా ఇప్పటికే హీరో దర్శకులు కొందరు ప్లాన్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు పరిస్థితి చూస్తేనేమో ఇలా అవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే నెల కూడా హారతి కర్పూరమవుతుంది.

షూటింగులు మొదలైతేనే థియేటర్లు తెరిచేందుకు ఇంకాస్త ధైర్యం వస్తుంది. ఇంత దారుణమైన అనిష్చితి కొనసాగడం ముందు ముందునష్టాలను ఇంకా తీవ్రతరం చేస్తుంది. లిమిటెడ్ క్యాస్టింగ్ ఉన్న వెబ్ సిరీస్ లకూ ఈ బెడద తప్పకపోతే ఇకపై వందలాది యూనిట్ సభ్యులతో చేయాల్సిన పెద్ద హీరోల షూటింగుల గురించి ఆలోచించాలంటేనే భయమేస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి హీరోలందరూ ఇప్పుడు చేయకపోతేనే మంచిదనే తరహాలో చెప్పేస్తున్నారు. అయితే సినీ కార్మికులకు మాత్రం తగినంత ఉపాధి లేక జరుగుతున్న షూటింగులలో అందరికీ అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అయితే వేరే రంగానికి వెళ్లిపోయే అగత్యం పడుతుందని అభిప్రాయపడుతున్న వారు లేకపోలేదు. ఇప్పుడు అందరి దృష్టి వ్యాక్సిన్ మీదే ఉంది. అది అందుబాటులోకి వచ్చే దాకా ఎవరూ కుదుటపడేలా లేరు.