iDreamPost
iDreamPost
విడుదల రోజే వివాదాలతో ఓపెన్ అయిన మాస్ మహారాజా క్రాక్ బ్లాక్ బస్టర్ అయిపోయి బ్రతికిపోయింది కానీ లేదంటే ఇంకా చాలా పరిణామాలు ఎదురుకోవాల్సి వచ్చేది. నిర్మాత మధు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ కు ఇవ్వాల్సిన బాకీ వల్ల జనవరి 9 రిలీజ్ రోజు ఏకంగా నాలుగైదు షోల దాకా వాయిదా పడి అభిమానులు ఎగ్జిబిటర్లు ప్రత్యక్ష నరకం చూశారు. హిట్టయిపోయి జనం బాగా చూశారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేది. సరే మధ్యలో ఎవరు వచ్చి సమస్యను పరిష్కరించారు ఎలా సెటిల్ అయ్యిందనేది గతం. నిన్నటి నుంచి క్రాక్ ఓటిటిలోకి కూడా వచ్చేసింది.
అయితే ఇక్కడితోనే అంతా అయిపోయిదనుకోవడానికి లేదు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని తనకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇంకా బాకీ ఉందని నిర్మాత నుంచి ఇప్పించాల్సిందిగా డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశాడు. దీని గురించి వివరణ కోరుతూ మధుకు ఉత్తరం కూడా వెళ్లిందని సమాచారం. అయితే క్రాక్ కు ముందు అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువయిందని అందుకే తననుంచి ఇవ్వాల్సింది ఏమి లేదని మధు తన వర్గాలతో అంటున్నట్టు వినికిడి. అధికారికంగా ఏ వివరణ ఇస్తారో తెలియదు కానీ ఇప్పుడీ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్స్ కి తెరతీసింది.
వసూళ్ల లెక్కల్లో క్రాక్ అనుకున్నదాని కన్నా ఎక్కువ రాబట్టుకుంది. నిర్మాత మధుకి ఏ మేరకు లాభాలు వచ్చాయో కంటి ముందు కనిపిస్తున్నాయి. పైగా డిజిటల్ ప్లస్ శాటిలైట్ కూడా మంచి రాబడి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గోపిచంద్ తన పెండింగ్ అమౌంట్ గురించి అడిగినట్టు సమాచారం. సుమారు 30 లక్షల దాకా ఆ మొత్తం ఉండొచ్చని అంటున్నారు. ఇందులో హీరో కానీ ఇంకొకరు కానీ చేయగలిగింది ఏమి లేదు. దర్శకుడికి నిర్మాతకు మధ్యే సెటిల్ కావాలి. క్రాక్ కన్నా ముందు మధు సమర్పకుడిగా వ్యవహరించిన అర్జున్ సురవరం కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకున్న విషయం గమనార్హం.