iDreamPost
android-app
ios-app

థియేటర్ల మనుగడకు మరో సవాల్

  • Published Apr 21, 2021 | 5:20 AM Updated Updated Apr 21, 2021 | 5:20 AM
థియేటర్ల మనుగడకు మరో సవాల్

నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్లు కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా థియేటర్ల మూసివేతను ప్రకటించడం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చెప్పడానికి అద్దం పడుతోంది. కేవలం వకీల్ సాబ్ ఆడుతున్న కొన్ని హాళ్లను మాత్రమే మినహాయించి మిగిలినవి క్లోజ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచే ఇది అమలులోకి వచ్చింది. ప్రభుత్వం రాత్రి 9 నుంచి ఉదయం 5 దాకా కర్ఫ్యూ విధించడంతో సెకండ్ షోలు వేసే ఛాన్స్ లేదు కాబట్టి ఈ కారణం కూడా నిర్ణయానికి దోహదపడింది. ఎన్ని రోజులు ఇలా మూసి ఉంటారనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే కానీ కనీసం ఇంకో నెల రోజుల వరకు తప్పేలా లేదు. దానికి సిద్ధపడి ఉండక తప్పదు.

కరోనా అనే కాకుండా అన్ని సినిమాలు వాయిదా పడటం కూడా ఎగ్జిబిటర్లను ఇబ్బందుల్లో నెట్టేసింది. తేజ సజ్జ ఇష్క్ సైతం పోస్ట్ పోన్ చేయడంతో కంటెంట్ లేక కేవలం వకీల్ సాబ్ ని నమ్ముకుని వందలాది థియేటర్లను నడపలేరు. అందుకే విధి లేక ఇలా చేశారు. లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాట పర్వం, పాగల్ ఇలా ఏప్రిల్ లో రావాల్సినవి మేలో అయినా వస్తాయా రావా అనే అనుమానం నెలకొంది. అలాంటప్పుడు ఆచార్య, నారప్ప, దృశ్యం 2ల గురించి ఊహించుకోవడం కూడా వృధానే. గత ఏడాది లాక్ డౌన్ వల్ల వందల కోట్ల నష్టాలతో కుదేలైన థియేటర్ రంగానికి శరాఘాతాలు పదే పదే తప్పడం లేదు.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా విశ్వరూపం కొనసాగుతోంది. మహారాష్ట్రతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అంత తీవ్రత లేనప్పటికీ అప్రమత్తత లేకపోతే జరిగే నష్టం గురించి ఇప్పటికే జనాలు ఎన్నో అనుభవాలు చవి చూశారు. లాక్ డౌన్ ఉండబోదని ప్రధాని మోడీ అంటున్నారు కానీ అది చివరి అస్త్రమనే హింట్ కూడా ఇచ్చారు. అంటే ఒకవేళ కట్టడి సాధ్యం కాకపోతే మరోసారి దాన్ని బయటికి తీయాల్సి వస్తుందనే సూచనేగా. అడ్వాన్సుల రూపంలో ఇప్పటికే కోట్లాది రూపాయలు నిర్మాతలకు చెల్లించిన పంపిణిదారులు వాటిని వెనక్కు తీసుకోలేక వాటి మీద వడ్డీలను భరించలేక పడుతున్న నరకం అంతా ఇంతా కాదు