iDreamPost
iDreamPost
కమర్షియల్ సినిమాకున్న రేంజ్ ఇతర జానర్లకు లేదన్న మాట వాస్తవం. ప్రేమకథలు సైతం చరిత్రలు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి కానీ పదే పదే వాటితోనే మనుగడ సాగించడం కష్టం. తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి హీరోలు లవ్ స్టోరీలతోనే బ్లాక్ బస్టర్స్ అందుకున్నా పదే పదే అలాంటి కథలే చేయడంతో ఎక్కువ కాలం కెరీర్ ని కొనసాగించలేకపోయారు. అందుకే మాస్ ఆడియన్స్ టార్గెట్ పెట్టుకోవడం ఎప్పుడైనా సేఫ్ గేమ్ అనిపిస్తుంది. అందులోనూ ఇమేజ్ ఉన్న స్టార్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా 90వ దశకంలో పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ని ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
1993లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనతో చేసిన ‘అల్లరి ప్రియుడు’ సిల్వర్ జూబ్లీ హిట్ అయ్యాక రాజశేఖర్ కు వరసగా అలాంటి అవకాశాలే రావడం ఎక్కువయ్యాయి. అన్నీ సాఫ్ట్ సినిమాలే చేస్తే మాస్ జనానికి తనెక్కడ దూరమవుతానో అనే సందేహం ఈయనకు లేకపోలేదు. దానికి తగ్గట్టే తమిళ్ హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాలని ఇక్కడ ‘అమ్మకొడుకు’, ‘గ్యాంగ్ మాస్టర్’గా రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యాయి.అందుకే మళ్ళీ యాక్షన్ వైపే వచ్చేశారు. అందులో భాగంగానే మాస్ ని మెప్పించే కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ క్రమంలో వచ్చిన సినిమానే ఈతరం ఫిలింస్ బ్యానర్ పై రూపొందిన ‘అన్న’. ఆటైం లో రాజశేఖర్ రెండు చిత్రాలు చేస్తున్నారు. ఒకటి మలయాళీ దర్శకుడు జోషి డైరెక్షన్ లో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన ‘అంగరక్షకుడు’.
రెండోది ముత్యాల సుబ్బయ్యకు కమిట్ అయిన అన్న. నిజానికి రాజశేఖర్ కు మొదటి సినిమా మీదే ఎక్కువ గురి. ఆ మాటే తన బయ్యర్లకు చెప్పేవారట. ఈ కారణంగానే ముందు రిలీజ్ కావాల్సిన అన్న ఆలస్యం అయ్యిందని ముత్యాల సుబ్బయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఇంత చేసినా అంగరక్షకుడు ఫ్లాప్ అయ్యింది. అన్న సూపర్ హిట్ కొట్టింది. రోజా, గౌతమి హీరోయిన్లుగా రూపొందిన అన్న అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేసింది. అడవి నుంచి నగరానికి వచ్చిన హీరో ఇక్కడి గూండాయిజాన్ని ఎదిరించి ఒక శక్తిగా మారే క్రమాన్ని సుబ్బయ్య గారు చూపించిన తీరుకు వంద రోజులు ఆడేంత మంచి ఫలితం దక్కింది. కీరవాణి సంగీతం, మంచి క్యాస్టింగ్ వసూళ్లే కాదు అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి. 1994 ఏప్రిల్ 7న రిలీజైన అన్న అదే నెలలో విడుదలైన బ్లాక్ బస్టర్లు భైరవ ద్వీపం, హలో బ్రదర్, యమలీల తాకిడిని తట్టుకుని మరీ ఘన విజయం సాధించడం విశేషం.