iDreamPost
android-app
ios-app

కూలీలను మింగేసిన కంటైనర్

కూలీలను మింగేసిన కంటైనర్

వారంతా చింతబాయి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు. రెక్కలు ముక్కలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వేరే గ్రామంలో సాధారణ కూలీకంటే మరో 150/- అధిక కూలి లభిస్తుందని ఆశపడి వరినాట్లు వేసేందుకు వెళ్లారు. ఆనందంగా పని పూర్తిచేశారు. ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు.. ఆటో ఎక్కిన పది నిమిషాల్లోపే ఒక కంటైనర్ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. దాంతో 9 మంది మృత్యువాత పడగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌-సాగర్‌ రహదారిపై నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ వద్ద గురువారం సాయంత్రం 6.20 గంటల సమయంలో మహిళా కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను కంటైనర్ వేగంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ సహా 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఘటనాస్థలిలోనే ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఒకరు దేవరకొండ ఆసుపత్రిలో మరణించారు.

కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం, దానికి తోడు అతివేగంతో కంటైనర్ నడపుతూ తన ముందుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కూలీలతో వస్తున్న ఆటోను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కంటైనర్ ఆటోను కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదతీవ్రత మరింత పెరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని మద్యం మత్తులో ఉనట్లు గుర్తించారు.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటం పలువురిని కన్నీరు పెట్టిస్తుంది. ఆటో డ్రైవర్‌ కూలీ కొట్టం మల్లేశ్‌తో పాటు అతడి భార్య చంద్రకళ,తల్లి పెద్దమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మల్లేశ్‌కు 10, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. తల్లిదండ్రులతో పాటు నాయనమ్మ కూడా మృత్యువాత పడటంతో ఆ చిన్నారులు దిక్కులేనివారయ్యారు.

ప్రమాదాన్ని గురించి తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా పరిమితికి మించి కూలీలను ఎక్కించుకోవడం, కంటైనర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగిందని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.