iDreamPost
android-app
ios-app

పాలకులను బట్టి తప్పొప్పులను మార్చే ‘జోతి’ జర్నలిజం

  • Published Jan 08, 2020 | 11:53 AM Updated Updated Jan 08, 2020 | 11:53 AM
పాలకులను బట్టి తప్పొప్పులను మార్చే ‘జోతి’ జర్నలిజం

పత్రికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా, విమర్శనాత్మకంగా వార్తలు ప్రకటించి విశ్లేషించే చోట ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుందని అంటారు. కానీ దురద్రృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పత్రికల ధోరణి ఇందుకు భిన్నంగా మారిపోయాయి. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వారి రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ కొట్టటమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నాయి.

జర్నలిజం అంటే జర్నలిస్టుల అభిప్రాయాలు చెప్పటం కాదు. జర్నలిజం అంటే సమాజంలో జరిగే వాస్తవాలని ప్రజల ముందు ఉంచటం అనే మౌళిక సూత్రాన్ని మరిచి అక్షరాలతో అబద్దాలని వల్లెవేయటం పరిపాటిగా మారింది. మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అతి సున్నితమైన మత విశ్వాసాల మధ్య మత చిచ్చు పెట్టేందుకు కూడా వెనకడుగు వేయటంలేదు. మరి ముఖ్యంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా ఈ ధోరణి పెరిగి పోయింది. నెలకొకటి చొప్పున కనీసం వివరణ తీసుకోకుండా మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వార్త అచ్చు వేసి తెల్లవారే సరికి ప్రజల గుమ్మాల ముందు ఉంచుతున్నారు.

కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంని ప్రొత్సహించటం అంటే క్రైస్తవ్యాన్ని ప్రచారం చేయటమే అని నిస్సిగ్గుగా అక్షరాలు అచ్చు వేసిన ఆంధ్రజ్యోతి దేముడిని సైతం వదలలేదు. క్రిందటి నెలలోనే తిరుమలలో శ్రీ యేసయ్య అంటూ కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయనున్నట్లు చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఘటన మర్చిపోక ముందే ఇంకో అసత్య వార్తతో ఆంధ్రజ్యోతి సిద్దమైంది.

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను పాలక మండలి దేవాదాయ శాఖకు భారీగా మళ్ళిస్తోందని, సవరించిన బడ్జెట్లో చిత్రాలు, నిధులు దుర్వినియోగం చట్ట విరుద్ధం అంటూ కధనం రాసి కొత్త ప్రచారానికి తెర తీసింది. అయితే బిజేపి నేత ,మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్ కృష్ణా రావు ఆంధ్రజ్యోతి వార్త పై స్పందిస్తూ ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించేదంటూ కొట్టిపడేశారు. దేవాదాయ శాఖ ఆద్వర్యంలోని దేవాలయాల నిర్వహణకు ట్రస్ట్ లు ఉన్నాయని ఐవైఆర్ పేర్కొన్నారు. సరైన ఆదాయ వనరులు లేని దేవాలయాలను టిటిడి దత్తత తీసుకోవడం చట్టంలోనే ఉందని, గతం లో అనేక సార్లు టిటిడి ఆయా దేవాలయాలకు కొద్దో గొప్పో నిధులు ఇస్తోందన్నారు. ఈ సారి దత్తత దేవాలయాలకు తగిన విధంగా నిధులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించ దగ్గ విషయం అంటూ ఆంధ్రజ్యోతి రాసిన కధనాన్ని ఖండిస్తూ ట్విట్ చేశారు.

తెలుగుదేశం హయాములో టి.టి.డి నిధుల మళ్ళింపు

ధర్మ పోరాట దీక్షలు అంటూ దేవస్థానం హుండికే 4 కోట్లు చిల్లు పెట్టి డిల్లీలో తెలుగుదేశం నేతలకు హోటల్ గదులకు భోజనాలకు వాడుకున్నారు. టీటీడీ కి దేవాదాయ శాఖకు సంబంధం లేని పనికి టీటీడీ సొమ్ము వాడుకోవటం దోపిడిగా ఆంధ్రజ్యోతికి అప్పట్లో కనపడలేదు. టి.టి.డి. దేశవ్యాప్తంగా అనేక కళ్యాణమండపాలు,గుడులు కట్టింది.ఆ నిర్మాణాలకు కావలసిన భూమిని ప్రభుత్వం లేక ధాతలు ఇచ్చారు కానీ ఎక్కడా టీటీడీ సొంత డబ్బుతో భూమిని కొని కళ్యాణమండపం,గుడి కట్టలేదు.మొట్టమొదటి సారి తెలుగుదేశం పాలనలో టీటీడీ రాజధాని ప్రాంతంలో గుడి కట్టటానికి ఎకరం 50 లక్షల చొప్పున 25 ఎకరాలు మొత్తం 12.5 కోట్లు పెట్టి కొన్నది.

రాజధానిలో టీటీడీ గుడి కట్టటం ఆనాటి ప్రభుత్వం ప్రచారానికే అని ప్రచారం జరిగింది. దీనికి కారణం అదే రాజధాని ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున వైకుంఠపురం అనే గ్రామంలో వందల సంవత్సరాల కిందటి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అలాంటి గుడిని అభివృద్ది చెయ్యకుండా తన హాయంలో కట్టారు అని చెప్పుకోవటానికి టీటీడీ తో కొత్త గుడి కట్టించటానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు,టీటీడీతో అనవసర ఖర్చు పెట్టించారు. ఈ దుర్వినియోగంమీద ఆంధ్రజ్యోతి విశ్లేషన రాయకపోగా గొప్పగా కీర్తించింది.

తిరుపతిలో అలివేలు మంగాపురం వద్ద ఆవిలాల చెరువు ఉంది.ఈ చెరువు చుట్టూ జరిగిన రియలెస్టేట్ వ్యాపారం ,కాంక్రీట్ నిర్మాణాల వలన ఈ చెరువుకు అనేక సంవత్సరాలుగా నీళ్లు రావటం లేదు. ఈ చెరువులో 181;13 కోట్ల టి.టి.డి నిధులతో ఒక ECO టూరిజం పార్క్ డెవలప్ చేయమని తెలుగుదేశం ప్రభుత్వం నాడు జీవో ఇచ్చింది . టి.టి.డి. ఎక్కడన్నా ఏదైనా నిర్మాణం చేయాలంటే ముందుగా ఆ భూమిని టీటీడీ పేరు మీదకి బదిలీ అవ్వాలి. ఇక్కడ ఆవిలాల చెరువు టి.టి.డి. కి బదిలీ అవలేదు,చెరువును మరొకరికి బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. మరి టి.టి.డి. నిధులతో ECO పార్క్ ను డెవలప్ చేయమని చంద్రబాబు ఆదేశించటం,ఆపనులకు శంకుస్థాపన చెయ్యటం టీటీడీ నిధుల దుర్వినియోగం.

చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు 2001లో అప్పటి దేవాదయ శాఖ మంత్రి శివరామరాజు టి.టి.డి నిధుల నుంచి ఒక కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. టీటీడీ నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వటం ఏ చట్ట ప్రకారం సరైంది?

అసత్యమైన వార్తలను, నిరాధారమైన వార్తలను పాఠకుడిని తప్పుదారి పట్టించే వార్తలను,ఒక విషయాన్ని వక్రీకరిస్తూ వార్తలను ప్రచురించరాదు. ఒక వార్తలోని ప్రధాన అంశాన్ని సమస్యకు సంబంధించిన అన్నీ దృక్పదాలను ప్రచురించాలి. వదంతులను , ఊహాగానాలను వార్తలుగా , వాస్తవాలుగా చూపుతూ ప్రచురించరాదు,ఇది మీడియా కనీసం ధర్మం.కానీ ఆంధ్రజ్యోతి మాత్రం దీనికి విరుద్దంగా పాఠకులను తప్పుద్రోవ పట్టించే వార్తలతో ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పని తప్పే అన్నట్లు చిత్రంచే ప్రయత్నం చేస్తుంది. . ఇలాంటి ధోరణి మీడియా విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.