ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అసెంబ్లీలో రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందులో సినిమాటోగ్రఫీ బిల్లు చర్చనీయాంశం అయింది. ఈ బిల్లు ప్రకారం ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాక బెనిఫిట్ షో లకు కూడా అనుమతులు లేకుండా పూర్తిస్థాయిలో ఆంక్షలు ఉండేలా కొత్త చట్టం పకడ్బందీగా మార్పులు చేర్పులు సూచించారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సినిమా పెద్దలు ఎప్పటినుంచో కోరుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా టికెట్ విధానాన్ని ఆన్లైన్ చేస్తూ కూడా బిల్లులో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ సినిమా రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ బిల్లును ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.
ఇక ఈ అమెండ్మెంట్ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫారం ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి నేరుగా థియేటర్లలో టికెట్ కొని సినిమా చూసే అవకాశం ఉండదు. అయితే లెక్కప్రకారం థియేటర్లో రోజు నాలుగు ఆటలు వేయాల్సి ఉన్నా సమయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రోజుకు 10 నుంచి 12 షోలు వేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని పేర్నినాని బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో వెల్లడించారు కూడా. సినిమా పరిశ్రమలో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు అని కొందరు భావిస్తున్నారని బలహీనతలను ఆసరాగా చేసుకుని అక్రమంగా సొమ్ములు వెనకేసుకుంటున్న వారిని కట్టడి చేసేందుకు ఈ ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు.
గతంలో సినిమా వాళ్లే ఆన్ లైన్ టికెట్లు పెట్టాలని కోరినట్లు గుర్తు చేసిన ఆయన ఇకమీదట ప్రభుత్వం నిర్ధారించిన సమయంలోనే సినిమా షో లు ప్రదర్శించాలని, సినిమా పరిశ్రమ కూడా ఇక మీదట ప్రభుత్వ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని వెల్లడించారు. మధ్యతరగతి వారు కూడా టికెట్లు కొని సినిమా చూడగలిగే విధంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. గతంలో ఉన్న టాక్స్ విధానం గందరగోళంగా ఉండేదని కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా టికెట్లు అమ్ముడవుతాయి కాబట్టి టాక్స్ విషయంలో కూడా ఎలాంటి టెన్షన్ లు ఉండవు అని ఆయన వెల్లడించారు.
ఇప్పటి దాకా బస్సులు, రైలు టికెట్లు ఆన్లైన్లో అమ్ముతున్నప్పుడు లేని అభ్యంతరాలు సినిమా టికెట్ల పై మాత్రం ఎందుకు అని ప్రశ్నించిన ఆయన తమకు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదని ఏ సినిమా అయినా నాలుగు షోలు వేయడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని వెల్లడించారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకే రేటు ఉంటుందని గతంలో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు టికెట్ రేట్లు పెట్టి అమ్ముకునేవాళ్ళని ఇకమీదట తమ ప్రభుత్వంలో అలాంటి వ్యవహారాలు కుదరదు అని తేల్చారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా సినిమా పరిశ్రమలో మాత్రం ఆందోళన నెలకొంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు 4 విడుదలకు రెడీ అవుతూ ఉండడంతో ఇప్పుడు ఆ సినిమాల నిర్మాతలు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.