iDreamPost
android-app
ios-app

కుర్రకారుని ఊపేసిన ఆలిన్ వన్ ఆనందం – Nostalgia

  • Published Dec 17, 2020 | 12:17 PM Updated Updated Dec 17, 2020 | 12:17 PM
కుర్రకారుని ఊపేసిన ఆలిన్ వన్ ఆనందం – Nostalgia

ప్రతి ప్రేమకథ ఎమోషనల్ గా ఉండాలని లేదు. వినోదాన్ని సమపాళ్ళలో జోడిస్తునే అవసరమైన చోట భావోద్వేగాలను పండిస్తే చాలు క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ ఆ సినిమాను ఆదరిస్తారు. జానర్ ఏదైనా ప్రేక్షకుడికి ఎంటర్ టైన్మెంట్ ముఖ్యం. చూస్తున్నంత సేపు తాను లీనమై ఎంజాయ్ చేశాడా లేదా అనేదే అతనికి కావాల్సింది. పెట్టిన టికెట్ కి న్యాయం జరిగిందనిపిస్తే చాలు అది బ్లాక్ బస్టరే. దానికో మంచి ఉదాహరణ 2001లో వచ్చిన ఆనందం. ఈనాడు అధినేత రామోజీరావు నిర్మాతగా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్టార్లు లేకపోయినా అద్భుత వసూళ్లతో అదిరిపోయే విజయాన్ని అందుకుంది.

1999లో రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల డెబ్యూ చేసిన నీ కోసం సినిమా సక్సెస్ తో పాటు పేరుని కూడా అందుకుంది. అయితే కమర్షియల్ మీటర్ లో దానికి ఎక్కువ రిటర్న్స్ రాలేదు. కానీ శ్రీను టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అందుకే ఈసారి ఇంకాస్త గట్టిగా తన సౌండ్ వినిపించాలని డిసైడ్ అయిన శ్రీను వైట్ల అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ రాసుకున్నాడు. పక్కపక్క ఇళ్లలోనే ఉంటూ రోజూ విపరీతంగా గొడవ పడే ఇద్దరు క్లాస్ మేట్స్ మధ్య ఒకరికి తెలియకుండా మరొకరి మీద ప్రేమ పుట్టడమనే కాన్సెప్ట్ ని అన్ని ఎమోషన్స్ మేళవించేలా సంభాషణల రచయిత చింతపల్లి రమణతో కలిసి స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. చంద్రమోహన్, ధర్మవరపు, సుధ, భరణి, వెంకట్, తను రాయ్ తదితరులు తారాగణంగా సెట్ అయ్యారు.

అప్పటికే నువ్వే కావాలి, చిత్రం లాంటి ట్రెండీ హిట్లతో దూసుకుపోతున్న ఉషాకిరణ్ పతాకంపై ఆనందం నిర్మాణం జరిగింది. ఒక్క సినిమా మాత్రమే అనుభవం ఉన్న ఆకాష్ హీరోగా, కన్నడ భామ రేఖను హీరోయిన్ గా పరిచయం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి జోష్ ఇచ్చే ట్యూన్లను సిద్ధం చేశాడు. ముప్పాతిక సినిమా సరదాగా నవ్వుతూ చూసేలా శ్రీను వైట్ల తీసుకున్న శ్రద్ధ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఇదెంత వినోదాన్ని పంచిందో హార్ట్ టచింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంతే స్థాయిలో గుండెను తడిపింది. ఫలితంగా ఆనందం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ముఖ్యంగా కనులు తెరిచినా కనులు మూసినా, ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా పాటలు మెలోడీ లవర్స్ ని చాలా కాలం వెంటాడాయి. అయితే ఆకాష్, రేఖలు మాత్రం ఈ స్టార్ డంని ఎక్కువకాలం నిలుపుకోలేకపోయారు.