iDreamPost
android-app
ios-app

దోచేసుకున్న సూపర్ దొంగ – Nostalgia

  • Published Dec 24, 2020 | 12:53 PM Updated Updated Dec 24, 2020 | 12:53 PM
దోచేసుకున్న సూపర్ దొంగ – Nostalgia

తెలుగు సినిమా ప్రస్థానంలో తమకంటూ గొప్ప చరిత్రలు లిఖించుకున్న అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. మూడు వందలకు పైగా చిత్రాలతో ఎవర్ గ్రీన్ ట్రాక్ రికార్డుని సొంతం చేసుకుని ఇప్పటికీ ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరు చేయలేదనే గొప్ప ఘనతను అందుకున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా ఒక్కోసారి కెరీర్ లో ఎగుడుదిగుడులు చూడటం సహజం. కానీ ఎంత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతారన్నదే ముఖ్యం. దానికో మంచి ఉదాహరణ చూద్దాం. 1993 టైంలో కృష్ణ గారి గ్రాఫ్ ఏమంత ఆశాజనకంగా లేదు. అంతకు ఓ ఐదారేళ్ళ ముందు నుంచి సోలో హీరోగా చేసినవి ఒకటి రెండు తప్ప ఆశించిన విజయాలు సాధించలేదు. 1994లో ఎస్వి కృష్ణారెడ్డి నెంబర్ వన్ రూపంలో బ్రేక్ ఇచ్చేదాకా ఇదే పరిస్థితి. మళ్ళీ కృష్ణ సత్తా అందులోనే బయటపడింది.

కానీ ఆ తర్వాత మళ్ళీ మరో అయిదు సినిమాల ఫలితాలు సంతృప్తికరంగా లేవు. రైతుభారతం, ఘరానా అల్లుడు, దొరగారికి దొంగ పెళ్ళాం, పోలీస్ అల్లుడు, ఎస్ నేనంటే నేనే వరసగా ఫ్లాపయ్యాయి. అప్పుడు సాగర్ చేసిన సాహసమే అమ్మ దొంగ. ఒకరు కాదు ఏకంగా ముగ్గురు ఫామ్ లో ఉన్న హీరోయిన్ల(సౌందర్య-ఆమని-ఇంద్రజ)ను కృష్ణకు జోడిగా ఆయన ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించినప్పుడు అందరూ షాక్ తిన్నారు. చిరు బాలయ్య లాంటి మాస్ హీరోల ప్రభంజనంలో ఇది రిస్క్ అవుతుందేమో అనుకున్నారు. కానీ సాగర్ భయపడలేదు. సత్యమూర్తి ఇచ్చిన కథ మీద నమ్మకం అలాంటిది. బడ్జెట్ కూడా రాజీపడలేదు. కోటి స్వరాలు సమకూర్చగా వినయ్ సంభాషణలు అందించారు. మ్యూజిక్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఏడు పాటలు ఒకదానితో మరొకటి పోటీ పడేలా వచ్చాయి.

1995 జనవరి 14 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలయ్యింది. నిజానికి అమ్మ దొంగ ఒక రివెంజ్ డ్రామా అంతే. కానీ దానికి విలన్ల కోణంలో ఫాంటసీని మిక్స్ చేసి కామెడీని తెప్పించడంతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో కృష్ణ-ఇంద్రజల ఎపిసోడ్ లో కావాల్సినంత ఎమోషన్ ని దట్టించడంతో అన్ని వర్గాలు సంతృప్తిపడ్డాయి. ముఖ్యంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో కృష్ణ చేసిన ‘నీతో సాయంత్రం ఎంతో సంతోషం’ డాన్స్ కు థియేటర్లు ఈలలతో మోతెక్కిపోయాయి. తన ఎనర్జీని సరిగ్గా వాడుకుంటే ఎలా విశ్వరూపం చూపిస్తారో కృష్ణ అమ్మదొంగాలో నటన ప్లస్ నృత్యం ద్వారా నిరూపించారు. యాభై ఆడితే గొప్పనుకున్న వాళ్ళు ఏకంగా శతదినోత్సవం జరుపుకోవడం చూసి నోరెళ్ళబెట్టారు.పోటీగా ఉన్న చిలకపచ్చ కాపురం, పోకిరిరాజా, మిస్ 420లను ఓవర్ టేక్ చేసి వసూళ్లు దోచుకుంది.