వైఎస్ జగన్‌పై కేసులు ఎందుకు, ఎలా, ఎప్పుడు పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని రాంబాబు చెప్పారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్‌పై కేసులు పెట్టించిన విషయం పవన్‌కు తెలియదా? అని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. కేసులు విచారణలో ఉన్నాకూడా చంద్రబాబు పదే పదే ముఖ్యమంత్రిని నేరస్తుడని అంటున్నారని, పవన్ మరో పక్క వంత పాడుతున్నారని రాంబాబు విమర్శించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డీఎన్‌ఏ ఒకేలా ఉందని, అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఉదయం చంద్రబాబు ఏం విమర్శలు చేస్తున్నారో.. సాయంత్రానికి పవన్ కూడా అవే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలను అధిగమించి పోరాడి వైఎస్సార్‌సీపీని గెలిపించిన ధీరుడు వైఎస్ జగన్ అని, ఆయనను విమర్శించే నైతిక అర్హత పవన్‌కు లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు 151 సీట్లలో పార్టీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, అలాంటి ముఖ్యమంత్రి అర్హతలను గురించి మాట్లాడే అధికారం పవన్‌కు ఎవరిచ్చారని నిలదీశారు.