చంద్రబాబు తానోడి అమరావతిని ఓడెనా , అమరావతిని ఓడి తానోడెనా ,
లేక తన పార్టీ మద్దతుదారుడు ఓడిన అమరావతి తన కలల రాజధాని అమరావతి ఒకటి కాదని , అమరావతి అనేది తానా ప్రాంతానికి పెట్టుకొన్న పెట్టుడు పేరు తప్ప ఈ ప్రాంతం దేవనగరి , విశ్వ నగరి , దేశ రాజధానిగా చరిత్రకెక్కిన అమరావతి ఈ ప్రాంతమూ ఒకటి కాదనే నిజాన్ని ఒప్పుకొంటారా , లేక ఎప్పటిలాగే అర్ధం లేని వాదనతో బుకాయిస్తారా
గడిచిన ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వినపడిన పేరు అమరావతి అనటం కంటే టీడీపీ పనిగట్టుకొని వినిపించిన పేరు అమరావతి .
29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా నిర్ణయించి , CRDA పరిధిలోకి చేర్చి , 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కాకుండా రియల్ ఎస్టేటు వ్యాపారం , ప్రయివేటు భాగస్వామ్యం తరహాలో నీకింత నాకింత అంటూ భూ సమీకరణ చేసి తాత్కాలిక అసెంబ్లీ , సెక్రటిరియేట్ , హై కోర్ట్ లు నిర్మించే వరకూ సాగిన ఏ ప్రక్రియలో కూడా అమరావతి ప్రాంతం భాగస్వామి కాకపోయినప్పటికీ చారిత్రక అమరావతి ప్రాంత పేరుని మాత్రం విస్తృతంగా వాడుకున్నారు . బాబు గారి కలల రాజధానికి ముద్దు పేరుగా అమరావతి పేరు పెట్టుకున్నారు తప్ప అమరావతికి ఈ రాజధాని ప్రాంతానికి ఏ విధమైన సంభందం లేదన్న విషయాన్ని కూడా రాష్ట్రంలోని మిగతా ప్రజలు గమనించే సావకాశం లేకుండా సాహో రాజధాని అమరావతి , దేవతలు నడియాడిన రాజధాని అమరావతి , దేశాన్ని పాలించిన చారిత్రక రాజధాని అమరావతి ,ప్రపంచానికి నాగరికత నేర్పిన నగరం అమరావతి అంటూ టీడీపీ కొనసాగించిన ప్రచార హోరులో అసలు అమరావతి ఇది కాదు అన్న విషయం కూడా కొన్నాళ్ళు ప్రజలకి అర్ధం కాలేదు .
ఒకానొక సమయంలో బాబు గారి అమరావతి చూద్దామని బయల్దేరిన అభిమాని గుంటూరులో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకొని అక్కడ దిగినాక రాజధాని ఏదీ , బాబు గారు నిర్మించిన నగరం ఏదీ , అద్భుత నిర్మాణాలు ఎక్కడ నన్ను మోసం చేసి మరో ఊర్లో దించారు అని ఆర్టీసీ బస్సు వాళ్లతో గొడవ పడి ఆనక ఏది అసలు అమరావతో తెలుసుకొని నాలుక కరుచుకొనేంతగా జనాల్ని గ్రాఫిక్స్ , అనుకూల పత్రికా కథనాలతో నమ్మించారు .
ఈ ప్రస్థానం 2018 వరకూ కొనసాగించినా రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలు తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడన్నట్లు రాజధాని నగరం రూపుదిద్దుకోక పోవడం , టీడీపీ గ్రాఫిక్స్ లో తప్ప క్షేత్ర స్థాయిలో జరిగిన అభివృద్ధి సూన్యం అని ప్రజలు తెలుసుకోవడంతో పాటు పెట్టుడు పేరు తప్ప రాజధాని ప్రాంతం అసలు అమరావతి కాదని , అసలు అమరావతి వేరని ఎప్పుడూ అమరావతి చూడని సుదూర ప్రాంత ప్రజలు కూడా తెలుసుకొని చివరికి భ్రమరావతిగా నవ్వుల పాలైంది తాత్కాలిక అమరావతి రాజధాని .
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పేరిట ఒకే చోట లక్షల కోట్లు పెట్టే ఆర్ధిక పరిస్థితి లేదని , పైగా దీని వలన ప్రాంతీయ అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడి అభివృద్ధి వికేంద్రీకరణ ప్రతిపాదికగా శాసన రాజధానిగా రాజధాని ప్రాంతాన్ని కొనసాగిస్తూ , కార్యనిర్వాహక రాజధానిని విశాఖలో , న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించి దరిమిలా దేవ నగరి రాజధాని అమరావతికి అన్యాయం చేస్తున్నారు , అమరావతిని చంపేస్తున్నారు అంటూ చంద్రబాబు , టీడీపీ శ్రేణులు ఆ అంశాన్ని తీవ్ర వివాదం చేయటంతో పాటు అమరావతి ఉద్యమం పేరిట తాత్కాలిక రాజధాని ప్రాంత నిర్మాణాల సమీపంలో టెంట్లు వేసి దీక్షలు నడిపించారు .
ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ నాయకులు భూ అక్రమాలు , ఇంసైడర్ ట్రేడింగ్ ల పై పలు ఆరోపణలు రావడం , ఇందుకు అనుకూలంగా గళమెత్తిన సినీ , రాజకీయ , వ్యాపార వర్గాల ప్రముఖులకు కూడా భూ అక్రమాలతో సంభందం ఉన్న విషయాలు బయట పడటంతో తరువాత వారు మౌనం వహించడం జరిగాయి .
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవలి జరిగిన స్థానిక ఎన్నికల్లో మండల కేంద్రం అయిన అమరావతి మేజర్ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఓడిపోయి వైసీపీ మద్దతుదారు 108 ఓట్ల తేడాతో విజయం సాధించటంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయి పడ్డట్టు అయ్యింది . బాబు ఇప్పుడీ ఓటమిని రాజధాని అమరావతి ఓటమిగా ఒప్పుకొంటాడా , లేక ఆ అమరావతి ఇన్నాళ్లు తాము దేవనగరిగా ప్రచారం చేసిన అమరావతి ఒకటి కాదు ఈ అమరావతి ఓటమి తమ రాజధాని ఓటమి కాదు అని కొత్త పల్లవి అందుకొని మరోసారి నవ్వుల పాలవుతారా అన్నది వేచి చూడాలి ..