iDreamPost
android-app
ios-app

అమరావతి పరిరక్షణ సమితి వర్సెస్‌ సచివాలయ ఉద్యోగులు

అమరావతి పరిరక్షణ సమితి వర్సెస్‌ సచివాలయ ఉద్యోగులు

కేంద్రీకృత, ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేందకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితికి సచివాలయ ఉద్యోగలు రూపంలో ఊహించని షాక్‌ తగిలింది. రాజధాని వికేంద్రీకరణ ను అడ్డుకొనే లక్ష్యంతో అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ ఏపీ సచివాలయ ఉద్యోగులు హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

అమరావతి పరిరక్షణ సమితి, దాన్ని నడిపిస్తున్న నేతలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీ ఆడిస్తున్న ఆటలో పావులనే విమర్శ మొదటి నుంచీ ఉన్నదే. దానికి తగ్గట్టే వారి వ్యవహార శైలి, అమరావతి పేరుతో పేరుతో మహోధ్యమం అంటూ సదరు పార్టీ అనుబంధ ఛానెళ్లు పత్రికలు ఇచ్చే కవరేజీలు అమరావతి పరిరక్షణ నిరసనను ఓ ప్రాయోజిత కార్యక్రమంగా మార్చేశాయి. అయితే ఎవరేమనుకున్నా పర్వాలేదు ఒక ప్రాంతంలోనే ఏపీ పాలనంతా కేంద్రీకృతం అవ్వాలి, అభివృద్ధి అంతా అమరావతిలోనే కుప్పపోయాలి, రాష్ట్ర ప్రజల భుజాలపై భరించలేని అప్పులు మోపైనా ఒక సామాజికవర్గ అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలి అనే తరహాలో అమరావతి పరిరక్షణ సమితి వ్యవహరిస్తోంది. దీనికోసం ప్రతిపక్షం దన్నుతో రకరకాల విన్యాసాలు చేస్తోంది. చివరికి ప్రభుత్వంతోపాటు సచివాలయ ఉద్యోగులపైనా ఆరోపణలకు దిగుతోంది. దీంతో చిర్రెత్తిన సెక్రటేరియెట్‌ ఉద్యోగులు అమరావతి పరిరక్షణ సమితికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

సచివాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రలోభాలకు పాల్పడుతోందంటూ అమరావతి పరిక్షణ సమితి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. సచివాలయ ఉద్యోగులకు రుణాలుగా రెండు వేల కోట్లు, విశాఖపట్నంలో ఇళ్ల నిర్మాణానికి మరో రెండు వేల ఐదొందల కోట్ల రూపాయాలను వెచ్చించేందుకు సిద్ధమైందని తెలిపింది. మేలో విశాఖపట్నం తరలింపునకు సిద్ధంగా ఉండాలంటూ ఉద్యోగులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని, దీనిపై ఉద్యోగ సంఘాల సమావేశంలో చర్చ సైతం జరిగిందని పేర్కొంది.

కాగా, అమరాతి రాజకీయాల్లోకి తమను లాగడాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా తీసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి అవాస్తవాలను తెలిపిందని కోర్టు మెట్లెక్కారు. సచివాలయ ఉద్యోగులుగా ఈ వివాదంలో తాము కూడా స్టేక్‌ హోల్డర్లమేనని తమ వాదనలను సైతం వినాలంటూ కోర్టును కోరారు. రాజధాని తరలింపు కోసం ప్రభుత్వం తమకెలాంటి తాయలాలు ప్రకటించలేదన్నారు. అలాగే రాజధాని తరలింపునకు రూ.5వేల కోట్లు కంటే ఎక్కువ ఖర్చవుతందనే అమరావతి పరిరక్షణ సమితి వాదనను ఖండించారు.

కేవలం 70 కోట్లతో రాజధానిని తరలించొచ్చన్నారు. హైదారాబాద్‌ నుంచి అమరావతికి తరలించినప్పుడు ఎంత ఖర్చు అయిందో కూడా చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. అమరావతితో పోల్చితే విశాఖపట్నంలో తక్కువ ఖర్చుతో నిర్మాణాలు చేపట్టవచ్చన్నారు. రాష్ట్రం అంటే కేవలం అమరావతే కాదన్నారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఎక్కడి నుంచైనా పనిచేయడానికి ఉద్యోగులుగా సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, సచివాలయ ఉద్యోగుల తాజా రియాక్షన్‌తో అమరావతి పరిరక్షణ సమితి డిఫెన్స్‌లో పడినట్లు కనిపిస్తోంది.