iDreamPost
android-app
ios-app

అమరావతి పోరాటం ఓ ఫ్లాఫ్ షో, దానికి ప్రొడ్యూసర్ చంద్రబాబు

  • Published Oct 11, 2020 | 11:24 AM Updated Updated Oct 11, 2020 | 11:24 AM
అమరావతి పోరాటం ఓ ఫ్లాఫ్ షో, దానికి ప్రొడ్యూసర్ చంద్రబాబు

చంద్రబాబు దర్వకత్వంలో సాగుతున్న అమరావతి ఓ ఫ్లాఫ్ షో అంటూ మునిసిపల్ మంత్రి బొత్సా సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఆయనే దర్శక, నిర్మాతగా అమరావతి ఆందోళన మీడియాలో నడుపుతున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు టీడీపీ, వారి తాబేదారులు,పెయిడ్ ఆర్టిస్టులు తప్ప ఎవరూ వ్యతిరేకించటం లేదన్నారు. చంద్రబాబు, టీడీపీ కెమెరా పోరాటాలకు ప్రజల్లో విలువ లేదు, మద్దతు అసలే లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2 వేల ఎకరాలకుపైగా బినామీ భూములు కొన్న చంద్రబాబు.. మరెలా గుండె నిబ్బరంతో ఉండగలిగాడని బొత్సా ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతి పేరుతో ఇంకా దోచుకోవాలన్న దుర్భిద్ధిని మానుకోవాలని సూచించారు.

అప్పుడప్పుడూ అమరావతి వచ్చే చంద్రబాబుని ఏపీ టూరిస్టు కింద పిలిస్తే బాగుంటుందని బొత్సా చలోక్తులు విసిరారు. చంద్రబాబు చేస్తున్న ఉద్యమం.. అమరావతి రాజధాని కావాలని కాదు, విశాఖ, కర్నూలు రాజధానులు కాకూడదని గుర్తించాలన్నారు. ఫ్లాప్ అయిన సినిమాకు, ప్రేక్షకులే లేని సినిమాకు.. అహో అద్భుతం అంటూ వారికివారే డప్పులు కొట్టుకుని వంద రోజులు, రెండొందలు రోజులు, మూడొందలు రోజులు ఫంక్షన్ లు చేసినట్టు ఉందని అమరావతి ఉద్యమాన్ని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఉద్యమమే లేదన్నారు. ఉద్యమం చేయాల్సినంత కారణమూ లేదని బొత్సా అన్నారు.

ఏపీలోని 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అధికార వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం అని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని 13 జిల్లాల ప్రజలంతా హర్షిస్తున్నారని, టీడీపీ, వారి తాబేదారులు, వారి పెయిడ్ ఆర్టిస్టులు తప్ప ఏ ఒక్కరూ వ్యతిరేకించటం లేదని తెలిపారు.
వికేంద్రీకరణ ప్రక్రియ.. శాసనసభలో చట్టం చేసిన రోజే ప్రారంభమైందన్నారు. అయితే కొంతమంది న్యాయ స్థానాల్లో వారికున్న పాత పలుకుబడితో అడ్డంకులు సృష్టిస్తున్నారు. వాటిని మేం అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, చంద్రబాబు కుప్పిగంతులు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇప్పటికీ చూస్తున్నాం అంటూ బొత్సా మండిపడ్డారు.

విశాఖలో జరిగిన ల్యాండ్ స్కాంల పై ఇప్పటికే సిట్ విచారణ జరుపుతుందన్నారు. గత ప్రభుత్వం సిట్ విచారణను మూలన పెడితే.. ఈ ప్రభుత్వం వచ్చాక, నిర్దిష్ట సమయం ఇచ్చి విచారణ పూర్తి చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు గుర్తు చేశారు. అమరావతి గ్రామాల్లో ఆత్మహత్యలు ఎవరూ పాల్పడినా అందుకు చంద్రబాబే బాధ్యుడన, ఆయనకే శిక్ష వేయాలన్నారు. టీడీపీ మాదిరిగా ప్రతి కార్యక్రమాన్ని గోరంత చేసి.. పబ్లిసిటీ కొండంత చేసుకోమని వివరించారు. ప్రజలు మెచ్చుకుంటే అదే మాకు పబ్లిసిటీ. అదే ప్రజలు మాకిచ్చే రివార్డు అంటూ బొత్సా కామెంట్ చేశారు. గత ఆరు నెలలుగా 15 రోజులు కూడా ఈ రాష్ట్రంలో నివాసం ఉండని వ్యక్తిని టూరిస్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు.