iDreamPost
android-app
ios-app

ఒక్కడు 35 మంది ప్రజా ప్రతినిధులను మోసం చేశాడు

ఒక్కడు 35 మంది ప్రజా ప్రతినిధులను మోసం చేశాడు

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 35 మంది ప్రజాప్రతినిధులు ఆ మోసగాడి చేతికి చిక్కారు. నిధుల పేరుతో మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు స్వాహా చేశాడు. ఈ వ్యవహారంలో మోసపోయిన కొంత మంది ప్రజాప్రతినిధులు పరువుపోతుందని మిన్నుకుండిపోగా.. మరికొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో తనను మోసం చేసిన విషయాన్ని అమలాపురం ఎంపీ అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ మోసగాడి ఆటకట్టించింది.

కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు పేరుతో అమలాపురం ఎంపీ అనురాధకు ఓ సైబర్‌ నేరగాడు వల వేశాడు. అతను చెప్పిన మాటలు నమ్మిన ఎంపీ పలు దఫాలుగా పేటీం ద్వారా 2 లక్షల రూపాయలు పంపారు. అయితే తాను మోసపోయానని తెలుసుకున్న ఎంపీ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును, విచారణను రహస్యంగా ఉంచిన పోలీసులు ఆఖరుకు ఆ మోసగాడిని పట్టుకున్నారు. మోసానికి పాల్పడింది తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీ నాయుడు అని తేల్చారు. అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయ మూర్తి రిమాండ్‌ విధించారు.

ఈ మోసగాడి చేతిలో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీలతోపాటు ఉభయ రాష్ట్రాలల్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని పోలీసులు విచారణలో రాబట్టారు. వారందరిని బాలాజీనాయుడు మోసం చేసినట్లు గుర్తించారు. బయటి ప్రపంచం తెలియని సామాన్యులు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసం మోసపోవడం తరచూ చూస్తుంటాం. అయితే ఉన్నత చదువులు అభ్యసించిన ప్రజా ప్రతినిధులు కూడా మోసపోవడం ఆశ్చర్య పరిచే అంశం.