iDreamPost
iDreamPost
స్టార్ హీరోల సినిమాల్లో జరుగుతున్న అనూహ్య మార్పులు అంతు చిక్కడం లేదు. ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్ కావడంతో త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబో మీద ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. ఇది ఇంకా అఫీషియల్ కాకపోయినా నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ప్రచారం గట్టిగానే ఉంది. ఇక అల్లు అర్జున్ కి పుష్ప తర్వాత చేస్తానని కమిట్ మెంట్ ఇచ్చిన కొరటాల శివ ఇక ఆ మూవీని వదిలేసినట్టేనా అని సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పలు మీడియా వర్గాల్లో ఇద్దరికీ చెడిందనే తరహాలో కథనాలు రావడంతో యువసుధ సంస్థ నుంచి ప్రకటన కూడా వచ్చింది.
ఈ కాంబినేషన్ ఆన్ లోనే ఉందని 2022 సమ్మర్ లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఒక ట్వీట్ అయితే చేసింది కానీ అటు అల్లు అర్జున్ ట్విట్టర్ నుంచి కానీ లేదా కొరటాల శివ హ్యాండిల్ నుంచి ఎలాంటి కదలిక లేదు. అంటే అనుమానాలు ఇంకా సజీవంగా ఉన్నట్టే అనిపిస్తోంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని అంశాలు తడతాయి. పుష్ప ఆగస్ట్ లోగా పూర్తవ్వడం కష్టంగానే ఉంది. విడుదల కూడా డిసెంబర్ కు వాయిదా వేశారని ఇన్ సైడ్ టాక్. దీని తర్వాత బన్నీ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేసేందుకు పెద్ద స్కెచ్ వేసినట్టు ఇప్పటికే న్యూస్ ఉంది. అది కూడా తారక్ తో ప్రశాంత్ చేయాలనుకుని డ్రాప్ అయ్యింది.
ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలు లేదా గాసిప్స్ స్టేజిలోనే ఉన్నాయి కానీ సీరియస్ గా కనిపిస్తున్న అంశాలు లేకపోలేదు. సదరు హీరోలు కూడా సైలెంట్ గా ఉండటం గమనార్హం. ఒకవేళ అల్లు అర్జున్ కొరటాల శివ నిజంగానే ఫ్యూచర్ లో టై అప్ అవ్వాలని అనుకున్నా కూడా కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పట్టేలా ఉంది. ఆలోగా ఎవరికెవరో ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. యువసుధ సంస్థ ప్రస్తుతానికి చెప్పినా కూడా ఇది కార్యరూపం దాల్చేదాకా ఖరారుగా చెప్పలేని పరిస్థితి. లాక్ డౌన్ తర్వాత షూటింగులే కాదు ఏకంగా అనౌన్స్ మెంట్లలో కూడా ఇంత భారీ మార్పులు జరగడం విశేషం