iDreamPost
iDreamPost
రాష్ట్రంలోని ఐదు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ ముందుకు వచ్చారు. స్థానిక దేవస్థానం పాలకమండలి విజ్ఞప్తి మేరకు ఆయన రూ.20 లక్షల విరాళం అందించారు. ఆలయంలో గోశాలతోపాటు వాహనశాల, రథశాల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించారు. రాష్ట్రంలో ఉన్న ఐదు పంచారామ క్షేత్రాల్లో శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం ప్రముఖమైంది.
ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఈ ఆలయంలో విగ్రహాన్ని స్వయంగా శ్రీరాముడు ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఆలయ క్షేత్రపాలకుడు జనార్థనుడు. ఇక్కడ రాజగోపురం తొమ్మిది అంతస్తులతో నిర్మించారు. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ నుంచి దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుంచి శివలింగంపై పడడం ఈ ఆలయం విశిష్టత.
అల్లు అర్జున్ తాత, ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యది పాలకొల్లు. అల్లు కుటుంబ సభ్యులతోపాటు బంధువులు ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ జరిగే దేవాలయాలు అభివృద్ధి వంటి పనులకు రామలింగయ్యతోపాటు, అరవింద్, తాజాగా అర్జున్ విరాళాలు విరివిరిగా అందజేస్తున్నారు. అర్జున్ ఇచ్చిన విరాళంతో నిర్మించిన గోశాల, వాహనశాల, రథశాలను ఈనెల 13వ తేదీ భోగి రోజు ముందు ప్రారంభించారు.
Also Read : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న అమలాపురం కుర్రోడు