iDreamPost
android-app
ios-app

ఇటు అల్లు అర్జున్ అటు సాయి పల్లవి

  • Published Apr 24, 2021 | 5:24 AM Updated Updated Apr 24, 2021 | 5:24 AM
ఇటు అల్లు అర్జున్ అటు సాయి పల్లవి

ఒకప్పుడు అభిమానులు తమ హీరో హీరోయిన్ల గురించి గర్వంగా చెప్పుకోవడానికి కేవలం థియేట్రికల్ రన్  మాత్రమే ఉండేది. మహా అయితే ఆడియో క్యాసెట్లు గ్రామ్ ఫోన్ రికార్డుల అమ్మకాలను హై లైట్ చేసుకోవడం తప్ప ఇంకే అవకాశం ఉండేది కాదు. ఒకవేళ దూరదర్శన్ లో ఆ సినిమా టెలికాస్ట్ అయినా దాన్ని ఎంతమంది చూశారనే లెక్కలు తెలిసేవి కావు కాబట్టి ఈ వ్యవహారమంతా చాలా పరిమితంగా ఉండేది. కానీ టెక్నాలజీ వచ్చాక ఇప్పుడీ రికార్డుల పర్వంలో యూట్యూబ్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఫస్ట్ లుక్ తో మొదలుపెట్టి లిరికల్ వీడియోస్, టీజర్, ట్రైలర్, ఫుల్ వీడియో సాంగ్స్ ఒకటా రెండా వ్యూసే కొలమానంగా నిర్మాతలు సైతం వీటి మీద గట్టి ఫోకస్ పెడుతున్నారు.

తాజాగా ట్రెండ్ అవుతున్న రెండు విషయాలను చూస్తే దీని గురించి మరింత క్లారిటీ వస్తుంది. ఇటీవలే అల్లు అర్జున్ 2017 నాటి సినిమా డీజే దువ్వాడ జగన్నాధం పూర్తి సినిమా 100 మిలియన్ల వ్యూస్ దాటేసి అటు హిందీలో ఇటు తెలుగులోనూ సెంచరీ కొట్టిన ఏకైక సినిమాగా కొత్త రికార్డు సెట్ చేసింది. అప్పట్లో ఓటిటి ఈ స్థాయిలో లేదు కాబట్టి ఆ సంవత్సరం చివర్లో దిల్ రాజు తన స్వంత ఛానల్ లోనే దీన్ని అప్లోడ్ చేశారు. ఫ్రీగా చూసే వెసులుబాటు ఉంది కనకే ఈ స్థాయిలో వీక్షణలు దక్కాయి. ఆ తర్వాత ఎంసిఎ మినహా తన సినిమాలన్నీ ఓటిటికే పరిమితం చేశారు రాజుగారు. లేదంటే మరికొన్ని రికార్డులు  సొంతమయ్యేవి.

ఇక సాయి పల్లవి సారంగదరియా అంటూ చేసిన లవ్ స్టోరీ అల్లరి ఇప్పుడు 150 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇంకా సినిమా విడుదల కాలేదు. వచ్చాక ఈ నెంబర్ ఏ స్థాయిలో పెరుగుతుందో ఊహించడం కష్టం. ఇటీవలి కాలంలో ఇంత రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకున్న లిరికల్ వీడియో ఇదొక్కటే. ఇదే సినిమాలో మిగిలిన పాటలు ఏవీ కూడా దీని దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ఫిదాతోనూ గతంలో రికార్డులు కొట్టిన సాయిపల్లవి ఇప్పుడు ఈ రూపంలో తనే వాటిని బ్రేక్ చేస్తోంది. మొత్తానికి ఒకపక్క అల్లు అర్జున్ మరో పక్క సాయి పల్లవిల క్రేజ్ యూట్యూబ్ లో మాములుగా లేదు. వీళ్ళ డబ్బింగ్ సినిమాలకు స్పందన కూడా ఇదే స్థాయిలో ఉంది