‘అల్లరి’ ఓ డిఫరెంట్ సినిమా. అనూహ్యమైన విజయాన్ని అందుకుంది ఆ సినిమా. న్యూ ఏజ్ కామెడీకి సంబందించి అదో ట్రెండ్ సెట్టర్ ఫిలిం. అల్లరి నరేష్ ఆ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. దర్శకుడిగా రవిబాబుకీ అదే తొలి సినిమా. ఆ తర్వాత ‘అల్లరి’ సీక్వెల్ చేయడానికి చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయిగానీ, అవేవీ వర్కవుట్ కాలేదు. కాగా, ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఆలోచనలు జరుగుతున్నాయట. అల్లరి నరేష్ వైపు నుంచే ఇనీషియేషన్ ప్రారంభమయ్యిందనీ, రవిబాబు కూడా ఆ సీక్వెల్ చేయడానికి ఆసక్తిగానే వున్నాడనీ తెలుస్తోంది. అయితే, రవిబాబు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వుంటాడు. ఎప్పుడూ కొత్తదనం గురించి ఆలోచించే రవిబాబు, ఈ క్రమంలో ఇటీవల కొన్ని తప్పటడుగులు వేసేశాడు. అయినా, ఆ ప్రయోగాలు మాత్రం ఆపడంలేదు. ఈసారి మాత్రం.. కొంచెం రూటు మార్చి.. ‘అల్లరి’ సీక్వెల్‌ని కమర్షియల్ యాంగిల్‌లో ప్లాన్ చేయబోతున్నాడట. అన్నీ కుదిరితే.. రెండు మూడు నెలల్లోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుందని సమాచారం. ప్రస్తుతం అల్లరి రవిబాబు ‘క్రష్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం విదితమే. కరోనా సీజన్‌లోనూ ఈ సినిమా ప్రమోషన్ గట్టిగానే చేసేసుకుంటున్నాడు. ఇక, అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఇది సీరియస్ ఫిలిం. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోస్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఏదిఏమైనా, అల్లరి నరేష్ – రవిబాబు నుంచి బోల్డంత అల్లరి చేసే ‘అల్లరి’ సీక్వెల్ వస్తే.. ఆ కిక్కే వేరప్పా.