iDreamPost
iDreamPost
అక్టోబర్ 15కు ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది. థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకొంత ఆలస్యమనే మాట వినిపిస్తోంది కానీ మల్టీ ప్లెక్సులు పేటిఎంలో అడ్వాన్స్ బుకింగ్ కోసం ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే కొత్త సినిమాలు కాదు లెండి. ఊహించినట్టుగానే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, భీష్మ, జాను, హిట్ లాంటి మొదటి మూడు నెలల నుంచి వచ్చిన మూవీస్ నే మళ్ళీ వేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. వీటితో పాటు కొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా రంగంలోకి దిగబోతున్నాయి. పివిఆర్ ఈ మేరకు ప్రకటనలు జారీ చేసింది. మొన్న ఓటిటి పే పర్ వ్యూలో వచ్చిన కపే రణసింగం, ఖాలీపీలిలు తెరమీదకు రాబోతున్నాయి. తమిళనాడులో దర్బార్, విజిల్, కాలా లాంటి వెనుకటి సినిమాలనే స్క్రీనింగ్ కోసం రెడీ చేస్తున్నారు.
అయితే ఇక్కడో చిక్కు ఉంది. పబ్లిక్ ని నేరుగా టికెట్ కౌంటర్ల దగ్గర రాకుండా ఆన్ లైన్ కొనుగోలుని ప్రోత్సహించమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే శాటిలైట్ లో పలుమార్లు వచ్చేసిన సినిమాలను థియేటర్లో చూసేందుకు యాప్స్ లో అదనంగా బుకింగ్ ఛార్జెస్ చెల్లించి వచ్చేవాళ్ళు ఉంటారా. అది కూడా చిన్న మొత్తం కాదు. ఒక్కో టికెట్ కు కనిష్టంగా పది నుంచి ఇరవై రూపాయల మధ్యలో ఉంటుంది. ఇదంతా ఇప్పుడు భారంగా అనిపించే వ్యవహారం. ఇంట్లో ఫ్రీగా చూసే అవకాశం ఉన్న సినిమాలను ఎదురు డబ్బులిచ్చి ఎందరు ప్రేక్షకులు ముందుకు వస్తారన్నది అనుమానమే. పోనీ ఛార్జీలు లేకుండా టికెట్లు అమ్మడానికి బుక్ మై షో, పేటిఎంలు సిధ్దంగా ఉన్నాయా అంటే ఆ సూచనలేమి కనిపించడం లేదు.
మరోవైపు తెలుగు నిర్మాతలు దీని గురించి ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. కనీసం ఫలానా టైంలో పూర్తయిన తమ కొత్త సినిమాలను విడుదల చేస్తామని మాట వరసకు కూడా చెప్పడం లేదు. అందరూ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఎవరో ఒకరు ప్రకటించకపోతారా అని ఎదురుచూస్తున్నారు. 15వ తేదీ తర్వాత ఓ పది రోజులు పరిస్థితిని నిశితంగా గమనించాక అప్పుడు ఆలోచిద్దామనే ధోరణే అందరిలోనూ కనిపిస్తోంది. లాక్ డౌన్ సమయానికి కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని యాజమాన్యాలు కోరుతున్నప్పటికీ అది జరిగే పనిలా కనిపించడం లేదు. 200 రోజులకు పైగా మూతబడిన థియేటర్లు తెరుచుకోవడం ఒకపక్క ఆనందాన్ని మరోపక్క జనం వస్తారా రారా అనే భయాన్ని సమానంగా కలిగిస్తోంది.