iDreamPost
android-app
ios-app

బాధ్యులు రె‘‘ఢీ’’ : తిరుపతి మీదా మాదా సై!

బాధ్యులు రె‘‘ఢీ’’ : తిరుపతి మీదా మాదా సై!

ఏపీలో ఇప్పుడు పార్టీలన్నీ తిరుపతిపైనే తమ ఫోకస్‌ మొత్తం పెట్టాయి. అన్ని ఎన్నికల్లోనూ విజయ పరంపరతో ఉన్న వైసీపీ లోక్‌సభ ఉప ఎన్నికలోనూ ధీమాగా ఉంది. అయితే మెజార్టీపైనే దృష్టి పెట్టి 3 నుంచి 4 లక్షలకు పైగా సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక టీడీపీ, బీజేపీ రెండో స్థానం కోసం పోటీపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థులు ఖరారుకాగా, బీజేపీలో కూడా కొలిక్కివచ్చినట్లు ఉంది. ఇక ప్రచార వ్యూహాలపైనే అన్ని పార్టీలూ దృష్టి పెట్టాయి. ఈ మేరకు కమిటీలు పూర్తయ్యాయి. ప్రాంతాల వారీగా ఆయా పార్టీలలోని ముఖ్యులకు బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానాలు ఇక ప్రచారంలో దూకుడు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

వైసీపీలో మూడంచెల వ్యవస్థ

విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ పనితీరులో ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా, ప్రచారంలో దూసుకువెళ్లేలా అధికార పార్టీ పకడ్బంధీగా కసరత్తు పూర్తి చేసింది. టార్గెట్‌ మెజార్టీ సాధించేందుకు సీఎం జగన్‌ బలమైన టీమ్‌ను రంగంలోకి దింపారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కలిపి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలకు కీలక మంత్రులను నియమించడం ద్వారా గెలుపును ముందే డిక్లేర్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. మంత్రులతో పాటు పాటు ప్రతీ నియోజకవర్గానికి మరో ముఖ్యనేతకు బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా పర్యవేక్షించేందుకు మరో ఇద్దరు సీనియర్లను నియమించారు.

దీనిలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పేర్ని నాని, సత్యవేడుకు మంత్రి కొడాలి నాని, గూడూరుకు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, సూళ్లూరుపేటకు మంత్రి కన్నబాబు, సర్వేపల్లికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, వెంకటగిరికి మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మంత్రి గౌతంరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. మొత్తం పార్లమెంట్‌ ఎన్నికల పూర్తి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కీలక నేత వైవీ సుబ్బారెడ్డి, సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను నియమించారు. మొత్తం మీద ఉప ఎన్నికలో గెలుపు కోసం రెండు పార్టీలు భారీగా ఏరాఁట్లు చేసుకున్నాయి. వీటిని పరిగణన లోకి తీసుకుంటే టీడీపీ ఎంత వరకు పోరాడు తుందనేది ప్రశ్నార్థకం గా మారింది.

వైసీపీ బాటలోనే బీజేపీ!

కమిటీల నియామకంలో బీజేపీ కూడా ఇంచుమించు వైసీపీ ఫార్ములానే ఫాలో అయినట్లు కనిపిస్తోంది. పార్లమెంట్‌ సెంగ్మెంట్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక ఇన్‌చార్జి పేరుతో పాటు, ప్రముఖ్‌ పేరుతో మరొకరిని కూడా బాధ్యులుగా అధిష్ఠానం నియమించింది. అలాగే ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరికొందరిని చేర్చింది. కన్వీనర్‌గా ఆదినారాయణ రెడ్డి తిరుపతి బైఎలక్షన్‌ కోసం బీజేపీ ప్రకటించిన ప్రచార కమిటీకి మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రచార కమిటీ సభ్యులుగా ఎంపీలు టీజీ వెంకటేశ్‌, సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, పార్టీ మాజీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ, శాంతారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావు, దాసరి శ్రీనివాసులు, రావెల కిశోర్‌ బాబు, వాకాటి నారాయణరెడ్డి, చంద్రమౌళి, సుధీశ్‌ రాంభొట్లను నియమించారు. పురందేశ్వరి, సత్యకుమార్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొనగా, ఎక్స్‌ అఫీషియో ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి మురళీధరన్‌, బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్‌ దేవధర్‌, ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు, నూకల మధుకర్‌, పీవీఎన్‌ మాధవ్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ పేర్లను ప్రకటించింది.

సర్వేపల్లి అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, ప్రముఖ్‌ గా సురేశ్‌ రెడ్డి వ్యవహరిస్తారు. అలాగే గూడూరుకు ఇంచార్జి పసుపులేటి సుధాకర్‌ రెడ్డి, ప్రముఖ్‌ గా చిరంజీవి రెడ్డి ఉంటారు. వెంకటగిరిలో సూర్యనారాయణ(ఇంచార్జి), నాగోతు రమేశ్‌ నాయుడు(ప్రముఖ్‌), సూళ్లూరుపేటలో ఇంచార్జి వాకాటి నారాయణరెడ్డి, సురేంద్ర రెడ్డి(ప్రముఖ్‌), సత్యవేడులో ఇంచార్జి చిన్నం రామకోటయ్య, కునిగిరి నీలకంఠ(ప్రముఖ్‌), శ్రీకాళహస్తిలో ఇంచార్జి సైకం జయచంద్రారెడ్డి, ప్రముఖ్‌ రమేశ్‌ రాయుడు, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా డాక్టర్‌ పార్థసారథి, ప్రముఖ్‌ గా బుచ్చి రాజుల పేర్లను బీజేపీ ప్రకటించింది.

కార్యాలయాలపైనే టీడీపీ దృష్టి

ఉప ఎన్నికలో ఎంతో కొంత ప్రభావం చూపి పరువు కాపాడుకోవాలన్న కోరికతో తెలుగుదేశం వ్యూహాలు రచిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించి ప్రతీ చోటా టీడీపీ ఉండేలా పాటు పడుతోంది. దీనిలో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా విభజించింది. ప్రతి క్లస్టర్‌కు ఓ టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు శ్రేణులకు సూచించారు. అలాగే పార్టీలోని ముఖ్యులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. నారాలోకేశ్‌, అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్‌లతో కూడిన ఐదుగురు సభ్యులతో పర్యవేక్షణ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించినా, ప్రచారంలో మాత్రం టీడీపీ వెనుకబడే ఉంది. దీంతో వెంటనే క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని శ్రేణులకు చంద్రబాబు సూచించారు. ఇలా అన్ని పార్టీలూ తిరుపతి ఉప ఎన్నిక పోరు కోసం యోధులను సిద్ధం చేశాయి.