iDreamPost
android-app
ios-app

“వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు” ఇక లేరు

“వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు” ఇక లేరు

ఏడిద గోపాలరావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో తెలుగు న్యూస్ రీడర్ గా,రంగస్థల నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు ప్రజల హృదయాల్లో ఏర్పరుచుకున్నారు.

ఇప్పుడంటే ప్రపంచంలో నలుమూలల్లో ఏ విషయం జరిగినా ప్రజలకు క్షణాల్లో తెలిసిపోతుంది కానీ అప్పట్లో దేశ ప్రజలకు ఆల్ ఇండియా రేడియో ద్వారానే అన్ని విషయాలు తెలిసేవి.ఏడిద గోపాలరావు గారి వార్తల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వేచి చూస్తూ ఉండేవారు. ముఖ్యంగా కాకా హోటళ్లలో, టీ స్టాల్లలో వ్రేలాడతీసిన రేడియోలో ఆయన చదివే వార్తలను వినడానికే కస్టమర్లు వచ్చేవారంటే అతిశయోక్తి కాదు.

రేడియో వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఆయన తనదైన ముద్రను ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా రంగస్థల నటుడిగా మహాత్మా గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు.ఆయనకు సాంస్కృతిక కళలపై మక్కువ ఎక్కువ. ఢిల్లీలో వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు మరియు సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తూనే ప్రజాసేవకు కూడా సమయాన్ని కేటాయించేవారు.తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీలో ఏదైనా పనిబడితే అలా వచ్చిన వారికి తన ఇంటిలో ఆశ్రయం కల్పించేవారు.

ఏకంగా పన్నెండు గంటల పాటు నిర్విరామంగా ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. ఎంత బిజీగా ఉన్నా ప్రజా సేవకు సమయాన్ని కేటాయించిన ఏడిద గోపాలరావు గారు వార్ధక్యం కారణంగా మృతి చెందడం సాంస్కృతిక అభిమానులకు అత్యంత బాధ కలిగించే విషయమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..

ఏది ఏమైనా ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ గా మాత్రమే కాకుండా తనదైన రంగస్థల నటనతో, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న ఏడిద గోపాలరావు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటుగా చెప్పుకోవచ్చు..