బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువి సంస్థ అప్డేట్స్ ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నా ఒక్కసారి అవి బయటికి రావడం మొదలైతే ఫ్యాన్స్ అన్నీ మర్చిపోయి సినిమా మీదే దృష్టి పెడతారు. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా టీజర్ ని రెడీ చేసినట్టు ఇప్పటికే టాక్ ఉంది. నిమిషం నిడివి ఉండే ఈ వీడియోలో విక్రమాదిత్య, ప్రేరణ పాత్రలను పరిచయం చేసి, కథను రివీల్ చేయకుండా కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కనిపించేలా చాలా స్పెషల్ గా దీన్ని ఎడిట్ చేయించారట. ఇంకో తొమ్మిది రోజుల్లో ఇది వచ్చేస్తుంది.
ఇదిలా ఉండగా రాధే శ్యామ్ రిలీజ్ డేట్ కూడా టీజర్ లోనే ప్రకటిస్తారని ట్రేడ్ కూడా ఎదురు చూస్తోంది. అంతే కాదు ఇప్పటికే డేట్లు ఇచ్చేసిన ఇతర నిర్మాతలు కూడా ఒకవేళ రాధే శ్యామ్ విడుదల కనక తమకు దగ్గర్లో ఉంటే వాయిదా వేసుకునేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని రీ షెడ్యూల్ బాట పట్టగా మరికొన్ని మాత్రం యువి నుంచి వచ్చే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాయి. జూన్ లో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది కానీ ఖచ్చితమైన సమాచారమైతే ప్రస్తుతానికి లేదు. రాధే శ్యామ్ ని రాబోయే సలార్, ఆది పురుష్ లను కూడా దృష్టిలో పెట్టుకుని గ్యాప్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం మేలో 7, 12, 21 డేట్లు జూన్ లో 11, 25 డేట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఇవి కాకుండా వేరేది ఎంచుకుంటే ఆ తేదీలలో ఉన్న సినిమాలు ఇక్కడ చెప్పిన వాటికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అసలే రాధే శ్యామ్ మీద 300 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుగుతోంది. ఎంతలేదన్నా రెండు వారాలకు పైగా ఫ్రీ గ్రౌండ్ అవసరం. ఎవరైనా పోటీకి వచ్చినా ముందు వాళ్ళకే నష్టం. రాధే శ్యామ్ రూపొందుతున్న విధానం, బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఆసక్తి రేపుతున్నాయి. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్న రాధే శ్యామ్ కి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది రెండో సినిమానే