iDreamPost
iDreamPost
అదేంటో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకులా పర్వం కొనసాగుతూనే ఉంది. అందరికంటే ముందు రిలీజ్ డేట్ ప్రకటన ఇవ్వడం, అనక వెనుకడుగు వేసి మళ్ళీ వాయిదా వేయడం కొన్ని నెలలుగా ఈ ప్రహసనం కొనసాగుతూనే ఉంది. పైగా రీ షూట్లలంటూ జరిగిన ప్రచారానికి ఆలస్యం కూడా తోడయ్యి వాటిని మరింత బలోపేతం చేసింది. గీత ఆర్ట్స్ బ్యానర్, హీరోయిన్ పూజా హెగ్డే, గీత గోవిందం ఫేమ్ గోపి సుందర్ సంగీతం ఇవేవి బ్యాచిలర్ కు గట్టి బ్యాక్ బోన్ లాగా కనిపించడం లేదు. దానికి తోడు ప్రమోషన్ విషయంలో టీమ్ అనుసరిస్తున్న ప్రణాళిక అభిమానుల ఆగ్రహానికి గురైన మాట వాస్తవం.
నిజానికి మొన్న జనవరిలోనే వచ్చి ఉంటే సరిపోయేది. ఏదో సగం సీటింగ్ కెపాసిటీతో అంతో ఇంతో రన్ దక్కేది. అయితే క్రాక్ లాగానో లేదా రెడ్ లాగానో సేఫ్ అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ అప్పటికి ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉండటంతో బ్రేక్ వేశారు. సరే అయిందేదో అయ్యిందని మళ్ళీ జూన్ 19 అని మొన్నామధ్య కర్చీఫ్ వేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఏప్రిల్, మేల సినిమాలన్నీ వాయిదా పడుతుండటంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరో డేట్ చూసుకోవడం తప్పేలా లేదు. ఎందుకంటే ఆ టైంకి వెయిటింగ్ లిస్ట్ లో భారీ చిత్రాలు సుమారు పదికి పైగానే ఉంటాయి.
అన్నయ్య నాగ చైతన్య లవ్ స్టోరీ కూడా వీటిలో ఉంది. ఎప్పుడు ప్లాన్ చేయాలో ఆ యూనిట్ కి సైతం అంతుచిక్కడం లేదు. మేలో సైతం పరిస్థితి కుదుటపడేలా కనిపించకపోవడంతో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇదీ వాయిదాలు తిన్న క్యాటగిరినే. ఇప్పటికే 150 మిలియన్ల వ్యూస్ సాధించి అనూహ్యమైన బజ్ ని రెట్టింపు చేసిన సారంగ దరియా పాట వల్ల లవ్ స్టోరీ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి బాగా పెరిగింది. ఒకవేళ మేలో సాధ్యం కాలేదంటే తమ్ముడి సినిమాను వాయిదా వేసి ఆ స్థానంలో అన్నయ్య రావాల్సి ఉంటుంది. మొత్తానికి కరోనా సృష్టించిన గందరగోళం బహుశా సినిమా పరిశ్రమ చరిత్రలో ఎప్పుడూ చూడనిది అని చెప్పాలి