iDreamPost
android-app
ios-app

అఖిల్ కొత్త టార్గెట్ మాస్

  • Published Aug 11, 2020 | 5:51 AM Updated Updated Aug 11, 2020 | 5:51 AM
అఖిల్ కొత్త టార్గెట్ మాస్

అక్కినేని మూడో తరం రెండో వారసుడు అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇంకో ఇరవై శాతం మాత్రమే బాలన్స్ ఉంది. దాన్ని పూర్తి చేసి 2021 సంక్రాంతి విడుదలకు టార్గెట్ చేసుకున్నారు. ఈ మధ్యే వదిలిన పోస్టర్ లో దాన్ని చూచాయగా చెప్పేశారు కూడా. ఇదిలా ఉండగా అఖిల్ నాలుగో చిత్రానికి దర్శకుడు దాదాపు ఫిక్సైనట్టేనని ఫిలిం నగర్ టాక్. ఈ వార్త గతంలోనే వచ్చినప్పటికీ ఇప్పుడో నిర్ణయానికి వచ్చేశారట. సైరా తర్వాత సుమారు ఏడాది నుంచి గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి అఖిల్ కోసం ఓ ఎంటర్ టైనింగ్ సబ్జెక్టు సిద్ధం చేసినట్టు తెలిసింది.

తనదైన శైలిలో కిక్, రేస్ గుర్రం స్టైల్లో యాక్షన్, ఎమోషన్, డ్రామా, కామెడీ అన్నీ ఉండేలా పక్కా ప్లానింగ్ తో రూపొందించి నాగార్జునతో సైతం గ్రీన్ సిగ్నల్ ఇప్పించినట్టు సమాచారం. నిజానికి అఖిల్ ఇప్పటిదాకా చేసినవన్నీ యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ మాత్రమే. మాస్ కి కనెక్ట్ అయ్యేలా ఏ ప్రయత్నమూ చేయలేదు. దర్శకులు కూడా అలాంటి కథలతోనే వచ్చారు. దానికి భిన్నంగా సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట. ఒకరకంగా ఇది మంచి నిర్ణయమే అని చెప్పాలి. నాగ్ మొదటి సినిమా విక్రమ్ ప్రేమ కథనే అయినప్పటికీ అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత కూడా కథల ఎంపికలో మాస్ అంశాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఓకే చేసిన సందర్భాలు ఎక్కువ.

జయాపజయాలు సంగతి ఎలా ఉన్నా అన్ని వర్గాలకు చేరువ కావడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఇక శివ సంచలనం తర్వాత అల్లరి అల్లుడు, వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం లాంటివి నాగార్జునకు మాస్ సెక్షన్ లో చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. అందుకే అఖిల్ కు సైతం అలాంటి బ్రేక్ అవసరమని గుర్తించే సురేందర్ రెడ్డిని ఒకే చేసినట్టు టాక్. సైరా కోసం రెండేళ్ళకు పైగా కష్టపడిన సురేందర్ రెడ్డి అది మంచి గుర్తింపు తెచ్చుకుంది బాహుబలి తరహాలో ఎలాంటి అద్భుతాలు చేయలేదు. చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీని డైరెక్ట్ చేసిన సంతృప్తి దక్కింది. అందుకే అఖిల్ సినిమాతో మరోసారి గట్టిగా రికార్డులను టార్గెట్ చేస్తారట. అదే జరిగితే అక్కినేని ఫ్యాన్స్ కు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది