iDreamPost
iDreamPost
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నిర్మాతల వినతికి తెలంగాణా ప్రభుత్వం సమ్మతించింది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న మల్లికార్జున, భ్రమరాంభ థియేటర్లలో ‘అఖండ’ బెనిఫిట్ షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఆయా థియేటర్లలో డిసెంబర్ 2న ఉదయం 4:30 బాలయ్య మూవీని ప్రదర్శించబోతున్నారు. ఈ స్పెషల్ షోలకు టికెట్ రేట్లను పెంచుకోడానికి కూడా అనుమతి లభించింది. ఇక, ఇప్పటికే ఈ షోలకు సంబంధించిన టికెట్లు కూడా బుకింగ్ అయిపోయాయి. అంటే.. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ఇక్కడే ‘అఖండ’ మూవీ ప్రదర్శన కాబోతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుని బెనిఫిట్ షోలకు బ్రేకులు వేసేసింది. అదే విధంగా సినిమా టికెట్ల విషయంలో కూడా నిర్ధిష్టమైన రేట్లు ప్రకటించింది. మునిసిపల్ కార్పోరేషన్లలో అత్యధికంగా రూ. 250, గ్రామీణ ప్రాంతాల్లో కనిష్టంగా రూ. 5 వరకూ సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లు ఖరారు చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్టానికి అనుగుణంగా విడుదలవుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సినిమా బెనిఫిట్స్ షోలకే తెలంగాణాలో అనుమతి లభించగా, ఏపీలో అవకాశం లేకుండా పోవడం విశేషంగా కనిపిస్తోంది.
బాలయ్యకు ఏపీలో ఉన్న ఫాలోయింగ్ రీత్యా ఆయన సినిమాలకు ఏపీలో కూడా అదనపు షోలు, అధిక టికెట్ రేట్లతో భారీగా సంపాదించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ వీక్ లోనే సినిమా ప్రభావం ఉంటుంది కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఛాన్స్ ఉండేది. కానీ ప్రభుత్వం అలాంటి వాటికి పూర్తిగా తెరదించేయడంతో అఖండ నిర్మాతలతో పాటుగా అనేక మంది పెద్ద హీరోల నిర్మాతలకు కూడా ఆశాభంగమవుతోంది. త్వరలో విడుదల కాబోతున్న అఖండ తో పాటుగా పుష్ప, ఆర్ ఆర్ ఆర్, ఆచార్య. రాధేశ్యామ్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సహా అందరి సినిమాల విషయంలో ఇదే పునరావృతమయ్యే అవకాశం ఉంది.
ఏపీలో సినిమా పడే సమయానికి తెలంగాణాలో ఒకటి రెండు షోలు పూర్తయ్యేలా కనిపిస్తోంది. దాంతో వీరాభిమానులు కొందరు సినిమా చూసేందుకు కూడా సరిహద్దులు దాటేందుకు సాహసిస్తారనడంలో సందేహం లేదు. ఏమయినా ఈ పరిణామం ఏపీలో సగటు సినీ అభిమానులకు ఊరట కల్పించగా, పెద్ద హీరోల అభిమానులకు మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు.