Idream media
Idream media
ఇరు వర్గాలకు చెందిన పిల్లలు సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆటలో వివాదాలు తలెత్తాయి. రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు ఘర్షణకు దిగారు. ఆ గొడవ ముదిరి ఏకంగా కాల్పులకు దారి తీసింది. ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ రంగంలోకి దిగడంతో పిల్లల మధ్య గొడవలు కాస్తా ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాటిగూడలో సాయంత్రం 6 గంటల సమయంలో మన్నాన్ పిల్లలతో పాటు ఇతరుల పిల్లలు క్రికెట్ ఆడుకోవడంలో గొడవ ముదిరింది. దాంతో పెద్దలు జోక్యం చేసుకున్నారు. వారు కూడా గొడవలకు దిగారు. ఆ కుటుంబాలకు ఎదురుగా ఉండే ఎంఐఎం నేత ఫారుఖ్ అక్కడకు వచ్చి హల్‌చల్ చేశాడు. ఘర్షణ కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. కోపోద్రిక్తుడైన ఫారుఖ్ తన వద్ద ఉన్న తల్వార్‌తో దాడి చేయడంతో పాటు పిస్తోలుతో కాల్పులు జరిపాడు. ఈ హఠాత్పరిణామంతో అందరూ హడలిపోయారు. ఈ ఘటనలో మన్నన్ (52), మోథెషిన్ (20), జమీర్ (55)కు గాయాలయ్యాయి. జమీర్‌కు రెండు బుల్లెట్‌లు తగలగా, ఒకటి కడుపులో దిగింది. మరొకటి చేతికి తాకింది. మోథెషిన్, మన్నాన్‌లకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలో సంచలనంగా మారింది. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి కాల్పులు జరిపిన ఫారుఖ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిలో మోథెషిన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
మున్సిపల్ ఎన్నికలే గొడవలకు కారణమా..?
గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తలెత్తిన వివాదాలే పరిస్థితి ఇంత సీరియస్‌గా మారడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఎన్నికల్లో తాటిగూడ నుంచి ఎంఐఎం అధ్యక్షుడు ఫారుఖ్ కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. కానీ ఓడిపోయాడు. స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. ఆ వార్డులో టీఆర్‌ఎస్ పోటీ చేయడం వల్లనే తాను ఓటమి చెందానని అప్పట్లోనే ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి నుంచీ స్థానికంగా టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన ఆ గొడవల్లో టీఆర్‌ఎస్ నేతకు చెందిన కుటుంబ సభ్యులు ఉన్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ఫారుఖ్ కాల్పులు జరిపినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తెలియగానే మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. పిస్తోలును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫారుఖ్‌పై ఆయుధాల చట్టం, 307, 327 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో మళ్లీ గొడవలు పునరావృతం కాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.