iDreamPost
android-app
ios-app

AIADMK – ఏడీఎంకే రాజ్యాంగం మార్పు.. ప్రధాన కార్యదర్శి పదవికి చెల్లు

  • Published Dec 03, 2021 | 12:36 PM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
AIADMK – ఏడీఎంకే రాజ్యాంగం మార్పు.. ప్రధాన కార్యదర్శి పదవికి చెల్లు

నిన్నమొన్నటి వరకు తమిళనాడులో అధికారంలో ఉన్న.. ఎంజీఆర్, జయలలితల హయాంలో ఒక వెలుగు వెలిగిన అన్నాడీఎంకే పార్టీ జయ తదనంతరం అనేక పరిణామాలకు, మార్పులకు గురవుతోంది. పార్టీలో ఇద్దరు ప్రధాన నేతల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతున్నా.. బహిష్కృత నేత, ఒకనాటి జయ నెచ్చెలి శశికళ పార్టీలోకి మళ్లీ రాకుండా అడ్డుకునేందుకు మాత్రం వారంతా ఏకం అవుతున్నారు. అందులో భాగంగా ప్రధాన కార్యదర్శి పదవే లేకుండా చేసేశారు. దాని కోసం పార్టీ రాజ్యాంగాన్నే మార్చి పారేశారు. ఈ చర్యలపై చిన్నమ్మ శశికళ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ప్రధాన కార్యదర్శి సర్వోన్నత పదవి

అన్నాడీఎంకే పార్టీ ఏర్పడినప్పటి నుంచి ప్రధాన కార్యదర్శి పదవే అత్యున్నతమైనదిగా ఉండేది. పార్టీ రూపొందించుకున్న రాజ్యాంగం ప్రకారం ప్రధాన కార్యదర్శికి సర్వాధికారాలు ఉంటాయి. ప్రిసీడియం, ఇతర కమిటీలు, పదవులన్నీ దాని తర్వాతే. అందుకే జయలలిత తదనంతరం ఆ పదవి కోసం పన్నీరుసెల్వం, పళనిస్వామిలతో పాటు జయ నెచ్చెలి శశికళ తీవ్రంగా పోటీ పడ్డారు. అదే తరుణంలో శశికళ జైలుపాలు కావడంతో ఓపీఎస్, ఈపీఎస్ మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగి.. హైకోర్టుకు ఎక్కింది. విచారణ జరిపిన కోర్టు ప్రధాన కార్యదర్శి పదవిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి.. దాని స్థానంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.

సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సాధ్యమైనంత త్వరగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించి.. కొత్త సభ్యులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి.. ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలని ఆదేశించింది. అప్పటినుంచి పార్టీ సమన్వయకర్తగా ఎడపాడి పళనిస్వామి, సహ కో ఆర్డినేటరుగా ఓ.పన్నీరు సెల్వం వ్యవహరిస్తున్నారు. ఈలోగా శశికళ మళ్లీ ఎంట్రీ ఇవ్వడం, ప్రధాన కార్యదర్శి పదవిని, పార్టీని చేజిక్కించుకుంటానని శపథం చేయడంతో సంస్థాగత ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. దీనిపై పార్టీ కార్యకర్త ఒకరు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో డిసెంబరులోగా ఎన్నికలు ముగించి తమకు తెలియజేయాలని కోర్టు ఆదేశించడంతో ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది.

కొత్తగా జంట నాయకత్వం

కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల తేదీలు ఖరారు చేయడంతోపాటు పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేశారు. పార్టీలో అత్యున్నతమైన ప్రధాన కార్యదర్శి పదవిని తీసేయడం ఈ మార్పుల్లో కీలకమైనది. దాని స్థానంలో జంట నాయకత్వాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాత్కాలికంగా ఉన్న కో ఆర్డినేటర్, సహ కో ఆర్డినేటర్ పదవులనే శాశ్వతం చేశారు. వీటికి ఈ నెల 7న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ గా తమిళ మగన్ హుస్సేన్ ను నియమించారు. ప్రస్తుతం కో ఆర్డినేటర్, సహ కో ఆర్డినేటరుగా ఉన్న పన్నీరుసెల్వం, పళనిస్వామిలే మళ్లీ ఆ పదవులకు ఎన్నిక కావడం లాంఛనప్రాయమే.

కాగా ఈ పరిణామాలను చిన్నమ్మ శశికళ తీవ్రంగా ఖండించారు. తనను పార్టీలోకి రాకుండా, ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టకుండా అడ్డుకునేందుకు ఏకంగా ఆ పదవే లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తనను అడ్డుకోలేరని, పార్టీని తాను చేజిక్కించుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యల వల్ల పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని శశికళ వ్యాఖ్యానించారు.

Also Read : AIADMK , Anwar Raja – ఆయన గుర్తింపున్న ఒకే ఒక ముస్లిం నేత, అయినా బహిష్కరణ తప్పలేదు