iDreamPost
iDreamPost
ఇప్పుడంటే పిల్లల మీద సినిమాలు తగ్గిపోయి అందరూ టెక్నాలజీ మత్తులో మునిగి తేలుతున్నారు కానీ ఒకప్పుడు బాలల చిత్రాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చేవి. అందులోనూ మంచి టాలెంట్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు దొరికేవారు. అలా బాగా ప్రభావం చూపించి కమర్షియల్ గానూ ప్రేక్షకుల ప్రశంసల పరంగానూ మెప్పించిన సినిమాగా ‘పాపం పసివాడు’ గురించి చెప్పుకోవచ్చు. 1972 సెప్టెంబర్ 29న విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఘన విజయం సొంతం చేసుకుంది. విదేశాల్లో చికిత్స కోసం మేనమామతో కలిసి చార్టర్డ్ ఫ్లైట్ లో బయలుదేరిన ఓ చిన్న పిల్లవాడు అనుకోకుండా ప్రమాదం జరిగి ఓ అడవిలో చిక్కుకుపోతాడు.
చుట్టూ క్రూర మృగాల భయం. పక్కనుండాల్సిన మావయ్య చనిపోయాడు. ఇంటి నుంచి తెచ్చుకున్న కుక్కపిల్ల తప్ప ఇంకే తోడూ లేదు. క్షణక్షణం భయంభయంగా గడుపుతూ అక్కడి నుంచి ఎలా బయటపడి తల్లితండ్రులను చేరుకున్నాడు అనేదే అసలు కథ. వి రామచంద్రరావు దర్శకత్వంలో ఏ శేషగిరిరావు దీన్ని నిర్మించారు. స్టూడియోలలో కాకుండా సహజత్వం కోసం షూటింగ్ ని రాజస్తాన్ లోని థార్ ఎడారిలో చేశారు. ఒళ్ళు మండిపోయే ఎండల మధ్య ముప్పైకి పైగా యూనిట్ సభ్యులను తీసుకుని నెల రోజుల పాటు కఠినమైన పరిస్థితుల మధ్య చిత్రీకరణ మొదలుపెట్టారు. నీళ్ళు దొరికేవి కావు. బయటి నుంచి తెప్పించడానికి సుమారు పది వేల రూపాయలు ఖర్చు పెట్టడం అప్పట్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్. గుడారాలు వేసుకుని కిందామీద పడుతూ పట్టువదలని దీక్షతో మొత్తానికి అక్కడి షెడ్యూల్ ని పూర్తి చేశారు.
టైటిల్ రోల్ పోషించిన మాస్టర్ రాము అద్భుత నటనకు ప్రేక్షకులు పరవశించిపోయారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. శభాష్ అంటూ మెచ్చుకున్నారు. ఎస్వి రంగారావు, నగేష్, సత్యనారాయణ, నాగయ్య, రాజబాబు, సూర్యకాంతం, ఛాయాదేవి లాంటి ఉద్దండుల మధ్య ఎలాంటి బెరుకు లేకుండా మాస్టర్ రాము నటించడం చూసి అందరూ షాక్ తిన్నారు. గొల్లపూడి మారుతీరావు గారి రచన విజయంలో కీలక పాత్ర పోషించింది. 10 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం అప్పట్లో ఓ సంచలనం. తర్వాత మాస్టర్ రాము చాలా సినిమాలు చేశాడు కాని వయసు వచ్చేనాటికి ఎవరికి తెలియనంత దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి సెటిలైపోయాడు. కాని పాపం పసివాడు సినిమా మాత్రం అందరి మదిలో చెదిరిపోని జ్ఞాపకంగా సుస్థిరస్థానం సంపాదించుకుంది.