Idream media
Idream media
అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి, నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. వారికోసం కేటాయించిన నిధులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేస్తారు. మలిదశలో రూ.20 వేలలోపు డిపాజిట్లు చెల్లించేందుకు కసరత్తు ప్రారంభించారు. ప్రతి బాధితుడికీ న్యాయం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది.
తమను ఆదుకోవాలంటూ వేలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు పాదయాత్ర సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మన ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే బాధితులను ఆదుకునేలా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం సైతం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించేలా బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించారు. రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ అక్టోబరు 18న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలిదశలో రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లించాలని భావించారు.13 జిల్లాల్లో తొలి విడత రూ.10 వేల లోపు డిపాజిట్లు మొత్తం రూ.263,99,00,983 చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
విజయవాడకు చెందిన అవ్వా వెంకటరామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లకు పైగా సేకరించింది. చివరకు వారికి భూములు ఇవ్వక.. సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.