మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో గట్టిజెల్ల తినేసిన తెలుగుదేశం పార్టీ మళ్లీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో తమకు ఆదరణ ఎక్కువగా ఉంటుందన్న భావనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తియుక్తులన్నీ ఒడ్డి,పోరుకు సిద్ధమవుతున్నారు.
మిగతా పట్టణాల విషయం ఎలా ఉన్నా విజయనగరం పట్టణానికి కార్పొరేషన్ స్థాయి వచ్చాక తొలిసారిగా జరుగుతున్న తొలి ఎన్నికల్లో తమ పట్టును నిలుపుకోవాలన్నది తెలుగుదేశం ఆలోచన. ఈ దిశగా అశోక్ గజపతిరాజు కుమార్తె , విజయనగరం నియోజకవర్గం ఇంచార్జ్ అదితి గజపతిరాజు మాత్రం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.
బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ మేయర్ పోస్టుకు తెలుగుదేశం నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన కంది మురళినాయుడు సతీమణి శమంతకమణిని అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఇంకా మేయర్ అభ్యర్థి ఖరారు కాలేదు.
ఇక మొదటి నుంచి పట్టణంలో తెలుగుదేశానికి ముఖ్యంగా రాజవంశానికి ప్రాధాన్యం ఉంటూనే వస్తోంది. పట్టణంలోని ప్రధాన మార్కెట్లోని దుకాణాలు, వ్యాపార సంస్థలన్నీ మాన్సాస్ స్థలాల్లో ఉంచడం, నామమాత్రపు అద్దెలతో వారంతా వ్యాపారాలు చేసుకుంటుండడం వంటి కారణాలతో వ్యాపారవర్గాలన్నీ అశోక్ గజపతి పట్ల కృతజ్ఞతగా ఉంటూ వస్తున్నారు. అయితే 2019లో అదే వ్యాపార సామాజికవరానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయ్యాక మాత్రం పరిస్థితి తారుమారైంది.ఏదైతేనేం, పట్టణంలో తమ పట్టును నిరూపించుకునేందుకు అశోక్ తరపున అయన కుమార్తె అదితి రంగంలోకి దిగారు.
అదితి రాచరికపు పోకడలు లేకుండా అందరితోనూ కలివిడిగా ఉంటూ వారిలో ఒకరుగా కలిసిపోవడం ఆమెకు కాస్త సానుకూలంగా మారింది. కార్యకర్తలను కూడా పేరుపేరునా పలకరించం ఆమెను క్యాడర్ కు మరింత దగ్గర చేసింది.
అయితే ఇక్కడ ఆమె ఒక్కరి ప్రయత్నమే విజయాన్నివ్వదన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర లక్షల జనాభా ఉన్న ఈ పట్టణం 2019 జులై 3న మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థ స్థాయికి ఎదిగింది. 2014లో కేవలం 40 మున్సిపల్ వార్డులు ఉండగా అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం 32, కాంగ్రెస్ 5, వైఎస్సార్సిపీ రెండు,స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందగా అశోక్ గజపతి ఆశీస్సులతో ప్రసాదుల రామకృష్ణ మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు. ఆయన భార్య కనకమహాలక్ష్మి కూడా రెండుసార్లు గతంలో మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు. అంతేకాకుండా గతంలో అశోక్ గజపతి సతీమణి సునీలా గజపతి సైతం మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు.
అయితే ఇప్పుడు కార్పొరేషన్ స్టాయికి ఎదిగిన తరువాత 50 వార్డులు ఏర్పాటయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్డులను గెలిపించి, తమ పార్టీకే మళ్లీ మున్సిపల్ పగ్గాలు వచ్చేలా చేయడం అంటే కష్టమే. అయినా అదితి మాత్రం రెండు నెలలుగా ప్రతిరోజూ కొన్ని పంచాయతీలు, వార్డుల్లో పర్వటిస్తూ ప్రజలతో మమేకమవుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
పట్టణంలో అక్కడక్కడా కొందరు బలమైన వాయకులు ఉన్నప్పటికీ అదితికి ఉన్న పాప్యులారిటీ మీదనే అభ్యర్థులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఆమె కూడా ప్రతి వార్డులోనూ పర్వటిస్తూ ప్రతి గడపనూ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరభద్రస్వామి చేతిలో ఓటమిపాలైన అదిత ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తన బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. 2019లో తండ్రీ, కూతురు ఓడిపోయారు. పార్టీని పునరుజ్జీవనం చేయడం, గట్టీ పోటీ ఇచ్చి గెలవడం దాదాపు అసాధ్యమే. కాకపోతే భవిష్యత్‌లో విజయనగరం ఎమ్మెల్యే సీటు తమదేనన్న ఆశతో ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కష్టపడుతున్నారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
Written By కె.గాంధీ