మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను విక్రయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పీటీషన్ పై హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘మిషన్ బిల్డ్ ఏపీ’ కింద ప్రభుత్వ ఆస్తులను విక్రయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్ బాబు పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ సందర్భంగా ఇరు వర్గాలు తమ వాదనను వినిపించారు. ‘మిషన్ బిల్డ్ ఏపీ’కి వ్యతిరేకంగా నమోదయిన ఫిర్యాదులు ఒకే అంశానికి చెందినవా? అంటూ హైకోర్టు అడిగిన ప్రశ్నకు ఏఏజీ అవునని సమాధానమిచ్చారు. ఇక్కడ సమస్య అదికాదని ప్రభుత్వాన్ని ఎవరూ నడపాలో నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని సుధాకర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు వేదికగా చేసుకొని వరుస ఫిర్యాదులు చేస్తూ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఏఏజీ కోర్టుకు తెలిపారు.
ధర్మాసనం-అనుమానం
ఫిర్యాదులు చేస్తున్న వారు పాలన చేస్తున్నారా? ప్రజలచే ఎన్నికకాబడ్డ వారు పాలన చేస్తున్నారా? అని తెలిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని… పరిపాలనను కూడా వారినే చేసుకోమనండి అని వ్యాఖ్యానించారు. సుధాకర్ రెడ్డి చేసిన వాదనలతో జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? హైకోర్టునా? పిటిషనర్ నా?’ అని ప్రశ్నించారు. ఇందుకు ఏఏజీ తాను పిటీషనర్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ‘మిషన్ బిల్డ్ ఏపీ’ పై పిటీషన్ దాఖలు చేసిన తోట సురేశ్ బాబు తరుపు న్యాయవాది భూములు విక్రయించడం తప్పని తమ వాదనను వినిపించారు.
వాయిదా
ఈ వాదనలకు కౌంటర్ గా మరో లాయర్ కాసా జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వం భూములు విక్రయం చేసిన సమయంలో ఈ సామాజిక కార్యకర్తలు ఎటు పోయారు? గత ప్రభుత్వంలో ఒక్క మాట కూడా మాట్లాడని సదరు కార్యకర్తలు ప్రస్తుతం మాత్రం కేసులు వేస్తున్నారని వాదనలు వినిపించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఇతర విషయాలు గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించింది. కోర్టులలో స్వీయ నిగ్రహం పాటించాలని హితవు పలికింది. పూర్తిగా విచారించి తీర్పును చెప్పడానికి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న అన్ని శాఖల కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో మీడియా, సోషల్ మీడియాని నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవడమే గాక ఏసీబీ దర్యాప్తును అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, శ్రేణులు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరుపున వాదిస్తున్న న్యాయవాదులలోనూ మార్పులు కనబడుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి. సీఎంగా జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూనే ఉండటం సంక్షేమ పథకాలకు ఇబ్బందిగా ఉందని ప్రభుత్వం తమ వాదనగా వినిపిస్తోంది.