అతడో పూజారి. భగవద్గీత నేర్పిస్తానంటూ ఓ గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత నెల 28న జరిగిన ఈ ఘటనపై కడప జిల్లా సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్టు చేసేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో జిల్లా వదిలేసి పరారైన నిందితుడు పూజారి దేరంగుల రవి అలియాస్ సత్యనారాయణ(35) ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకున్నాడు.
అంతే కాదు సొంత ఫోను వదిలేసి.. కనిపించినవారి ఫోన్లు తీసుకుని కుటుంబ సభ్యులు, ఇతరులతో మాట్లాడుతున్నాడు. అతడి ఇంటికి వచ్చే ఫోన్లపై నిఘా పెట్టిన సుండుపల్లె పోలీసులు.. కాల్ ట్రాకింగ్ ద్వారా అతడు తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని అన్నవరం ఎస్‌ఐ మురళీమోహన్‌కు చేరవేయడంతో, వారు నిందితుడి కోసం వెతకడం ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం నిందితుడు అన్నవరంలోని మెయిన్ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆదివారం సుండుపల్లె నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించారు.